ఆకట్టుకున్న వింజమూరి సంకీర్త్ అష్టావధానం

 ఆస్ట్రేలియా కు చెందిన తటవర్తి గురుకులం గురువు " అవధానార్చన భారతి "బ్రహ్మశ్రీ తటవర్తి శ్రీ కళ్యాణ్ చక్రవర్తి" ఆధ్వర్యలో చి. వింజమూరి సంకీర్త్ ప్రథమ అష్టావధానం తేది 12-10-2024, శనివారం విజయదశమి రోజున జూమ్ వేదికగా జరిగింది. నల్లగొండ జిల్లా, చింతపల్లి మండలం వింజమూరు గ్రామంలోని  శ్రీ శివ - ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణం నుండి పాల్గొన్న ఈ అవధానం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంట కు ప్రారంభమైన ఈ అష్టావధానం సాయంత్రం ఐదు గంటల వరకు అంతర్జాల వేదికగా కొనసాగింది. హైదరాబాద్ అమీర్పేట లో ఉంటూ ఎనిమిదవ తరగతి చదువుతున్న పదమూడేళ్ళ చి. సంకీర్త్ అవధానానికి సంకీర్త్ పద్యగురువు, ఆస్ట్రేలియా లోని తటవర్తి గురుకులం గురువు, అవధాని తటవర్తి శ్రీ కళ్యాణ్ చక్రవర్తి సంచాలకులుగా వ్యవహరించారు. అవధానం లో  "భీముడు జంపె రావణుని భీకర లీల మహేగ్ర తేజుడై" అని బృందావనం రమణ కుమార్ ఇచ్చిన సమస్యకు  బాలావధాని "క్షేమము గూర్చగా ధరకి శ్రీయుత రూపము నెత్తె భూతలిన్ 
ధామముగాను వెల్గు వరదాయకుడై రణధీరయోగియై
స్వామిగ లోక రక్షణ కు సంతసమొంద రణాన రాముడే 
భీముడు జంపె రావణుని భీకర లీల మహేగ్ర తేజుడై
అని చక్కగా పూరించారు బాలావధాని సంకీర్త్. డా. సురేశ్ బాబు దత్తపది అంశంలో "కరి వరి మరి తరి" పదాలు ఇచ్చి అమ్మవారిని వర్ణించమని అడగగా "దేవి శ్రీకరి శాంకరి దివ్యవాణి
నీదు సేవను తరియించి విత్యముగను 
లోకమును గావ రిపులను రూపుమాపి
కావుమమ్మ ధరన్ మరి కరుణ జూపి అంటూ పూరించాడు. కృష్ణవంశీ పాలకొల్లు వర్ణన అంశంలో ఉయ్యాల సేవ వర్ణన అడుగగా "వెంకటాచలమని వేంకటేశుని గొల్చి , ఊయలూపుచుండ హాయిగాను, భక్తులకు వరముగ భవ్య స్వరూవమై, వెలసినట్టి దేవ వినయ నుతులు" అంటూ చక్కగా వర్ణించారు. అష్టావధాని డా. బోరెల్లి హర్ష నిషిద్ధాక్షరి అంశం సరస్వతీ వర్ణన చక్కగా సాగింది, శ్రీశాభ్దీ వాగ్భావా, ఈశామణి నీల వేద్యవే కవి నవధీ, శ్రీశారద నినుగొల్తును, దేశమ్మున విద్యనొసగి దీవెనలిడుమా అంటూ నిషిద్ధాలను అధికమించి ఎంతో అనుభవమున్న అవధానిగా చక్కని పద్యాన్ని పూరించి అందరి అభినందనలు చూరగొన్నాడు. న్యస్తాక్షరి లో డా. వేంకట సీతారామ దీక్షితులు ఒకటవ పాదంలో మొదటి అక్షరం శ, 2వ పాదంలో 2వ అక్షరం మ,   3వ పాదంలో 11వ అక్షరం సా, 4వ పాదంలో 19వ అక్షరం పా వచ్చే విధంగా దుర్గాపూజ ను వర్ణించమని అడుగగా "శమియగు నీ స్వరూపము సుశక్తినొసంగగ దివ్య మాతవై 
గమనము దెల్పుచున్ సుమతి కామితదాయిని సింహవాహిని
సమత వహించుదేవతగ సారమునిచ్చుచు మమ్ముగావవే
మమతయె  పొంగగా ధరణు మానితమూర్తి ముదంబు పాడెనే అంటూ పూరించాడమే కాకుండా ధారతో కూడిన ధారణ చేసి అందరి మనసులను ఆకట్టుకున్నాడు. వీటితో పాటు పాలూరి వెంకటరాజు అడిగిన ఆశువు, కుమారి ఆరేటి నిత్యశ్రీ, చి. ముక్తేశ్వర్ ఆరేటి లు ఇచ్చిన చిత్రాలకు పద్యం చెప్పడంతో పాటు మద్యమద్యలో అవధాని ఏకాగ్రతకు భంగం కలిగించేలా డా. రాయవరం రఘునందన్ అప్రస్తుత ప్రసంగం లో పలు ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా జూమ్ ద్వారా శతావధాని ఆముదాల మురళి, నా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గోగులపాటి కృష్ణమోహన్, సురేంద్ర నాధ్, ఉషా శ్రీధర్ (యు‌. ఎస్.) వడుగురు మూర్తి ప్రభృతులు పాల్గొని అవధాని కి అభినంధన పూర్వక ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో వింజమూరి సంకీర్త్ తాతయ్య నానమ్మ లు వింజమూరి నర్సింహమూర్తి, హేమలత, తల్లిదండ్రులు తేజు, భార్గవ్ లతో పాటు కుటుంబ సభ్యులు వింజమూరి రామన్న, కృష్ణమూర్తి, నాగన్న, కిరణ్, మురళి తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు