సునంద భాషితం:-వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయములు-697
వాలుకా న్యాయము
******
వాలుకా అనగా ఇసుక.
 మరి ఇసుక న్యాయము అనగా ఏమిటో తెలుసుకుందాం.
 ఇసుక గురించి చెప్పుకోవాలంటే చాలా విషయాలే ఉన్నాయి. "ఇసుక తైలం"," కాలం ఇసుకలా జారిపోతోంది", ఇసుక తిన్నెలు,"ఇసుక రేణువులా" -ఇలా అనేక సామెతలు, జాతీయాలు ఇసుక గురించి ఉన్నాయి.
రాళ్ళు విచ్చిన్నమై చిన్న చిన్న రేణువులుగా మారి , ఖనిజాలతో కూడిన మిశ్రమాన్ని ఇసుక అంటారు.ఇది ప్రకృతిలో లభించే విలువైన పదార్థము.ఇది కంకర కంటే చిన్నగా, మెరుగ్గా, ఒండ్రు మన్ను కంటే గరుకుగా,మెరుపుతో కూడి ఉంటుంది.కాంక్రీట్ తయారీకి ఇసుక ఎంతో అవసరం. ఎడారిలో ఎంత ఇసుక ఉన్నా ఈ కాంక్రీటు తయారీకి పనికి రాదు.అందుకే కాంక్రీటు తయారీలో ఉపయోగించే ఇసుకకు అధికమైన డిమాండ్ ఉంది.
అలాంటి ఇసుక నదులలో నీటి ప్రవాహం వల్ల ఏర్పడుతుంది.రాళ్ళు కొట్టుకుని పోతూ రాపిడికి గురై చిన్న చిన్న ముక్కలుగా, రేణువులుగా విడిపోవడంతో ఇసుక ఏర్పడుతుంది. సముద్రాల ఒడ్డున కూడా ఎక్కువగా ఉంటుంది. అంతే కాదు గాలి వేగంతో ఒకోసారి ఇసుక కూడా పైకి లేస్తుంది. అలా గాలిలో ప్రయాణం చేసిన ఇసుక ఒక్కో చోట అధికంగా చేరి ఇసుక దిబ్బలు ఏర్పడుతాయి. అలా మొత్తం ఇసుకతో ఉన్న దిబ్బలను ఎడారులు  అంటారు.
 భవన నిర్మాణానికీ ఇసుక ఎంతో అవసరం. పునాదులలో మొదట ఇసుకను ఒక పొరగా వేసి కూర్చడం రాళ్ళను పేర్చడం,వాటి మధ్య మళ్లీ ఇసుక కూర్చడం వల్ల పగుళ్ళు రాకుండా ఉంటాయి.ఇటుకల తయారీలో మంచి ఇసుకను ఉపయోగిస్తే ఇటుకలు గట్టిగా, మన్నికగా ఉంటాయి. వరదలు వచ్చినప్పుడు, చెరువులు గండి పడినప్పుడు వాటిని ఆపడానికి ఇసుక బస్తాలు అడ్డంగా వేస్తారు. రైలు పట్టాల కింద ఇసుకను ఉపయోగించడం వలన పట్టాలు రైళ్ళు ఎంత వేగంగా నడిచినా కూడా ఎలాంటి యిబ్బంది వుండదు.
అయితే నదులలో దొరికే ఇసుకను విచక్షణా రహితంగా తోడి ఉపయోగించడం వల్ల నదులలోని భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి.
 కాబట్టి నదులను కాపాడుకోవాలంటే నదుల్లో ఇసుక అక్రమంగా తరలిపోకుండా చూసుకోవాలి.ఇసుక మాఫియాలను అరికట్టాలి. ప్రత్యామ్నాయ మార్గాలలో ఇసుకను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఏటిలో,సముద్రం ఒడ్డున ఇసుక ఉన్న చోట గుంట తీస్తే తీయని నీరు లభించడం విశేషం.
ఇసుక గురించి ఓ కవి ఇలా అంటాడు. "తివిరి యిసుమున తైలంబు తీయవచ్చు/ తవిలి మృగ తృష్ణలో నీరు త్రాగవచ్చు/ తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు చేరి మూర్ఖుల మనసు రంజింప రాదు"-  అంటే మూర్ఖుల మనసులో మార్పు తేవడం ఇసుకలో నూనె తీయడం  లాంటిది.ఇసుకలో నూనె తీయలేం.తీయడమనే ప్రక్రియ ఎంత కష్టమో సాధ్యం కాని పనో ఈ పద్యం ద్వారా మనం గ్రహించవచ్చు.
 
మహాభారతాన్ని రాసిన వేదవ్యాసుడు  ఇసుకతో సరస్వతీ దేవి విగ్రహాన్ని తయారు చేసి బాసరలో ప్రతిష్టించాడని పురాణ కథనం.ఇక  ధర్మపురిలో కూడా ఇసుకతో చేసిన శివలింగం/ సైకత లింగం భక్త కోటిని ఆకట్టుకుని పూజలు పొందుతుంది.
 ఈ పాటికి  మనందరికీ"వాలుకా న్యాయము" అంటే అర్థమైపోయుంటది. ఇసుక అతి చిన్న రేణువుగా ఉన్నప్పటికీ, విరివిగా దొరుకుతుంది కదాని ఎంతో విలువైన ఇసుకను దుర్వినియోగం చేయకుండా చూడాలి.
 వజ్రం సాన బెడితే మెరుస్తుంది, ఇసుక రాపిడి వల్ల  అందంగా కనిపిస్తుంది.మనిషి చిన్న చిన్న కష్టాలతో కూడిన రాపిడిలో  కలిగిన అనేక రకాల అనుభవాల పాఠం మనిషిలో యుక్తాయుక్త విచక్షణను కలిగిస్తుంది.గోదావరి ఒడ్డున చిన్న చిన్న ఇసుక తిన్నెల మీద కూర్చుని నది అందాలను చూస్తూ ఉంటే ఓ అద్భుతమైన అనుభూతి మన సొంతం అవుతుంది. సైకత శిల్పాలు తయారు చేసే శిల్పుల  గొప్ప తనం ఎంత చెప్పినా తక్కువే.
మరి మన పెద్దవాళ్ళు ఈ "వాలుకా న్యాయము"  ద్వారా చెప్పిన అంతరార్థం గ్రహించి"కాలాన్ని మన చేతుల్లోంచి ఇసుకలా జారిపోనీయకుండా చూసుకుందాం.మనమూ ఇసుకలా ఈ అనంతకోటి ఇసుక రేణువుల్లో  ఒకరమని తెలుసుకొని ,ఇతరులకు ఇసుక రేణువంత సాయమైనా చేసి మన జన్మను సార్థకం చేసుకొందాం.చెప్పిన వారి మాటలను వినయంగా  విందాం. శిరసావహించి పాటిద్దాం.

కామెంట్‌లు