సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు-676
విని గమన విరహ న్యాయము
*****
 విని గమనము అనగా ఒక వస్తువును రెండు విధములుగా సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఏ విధమైన వైరుధ్యం కలగకుండా ఒకే రకముగా సాధించవలెనను నియమమే విని గమనము.అనగా ఒక్క అంశాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం.అయితే ఇతర అంశాలు కూడా సాధ్యమైనప్పుడు కొన్ని కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవడమని కూడా అర్థము.విరహ అనగా ఎడబాటు అని అర్థము.
 విరహమంటే భర్త భార్యకు,భార్య భర్తకు భౌతికంగా దూరంగా ఉండేటప్పుడు వాళ్ళు అనుభవించే మానసిక వేదనను విరహం అనవచ్చు. పరస్పరం కలుసుకోవాలనే కోరిక బలంగా ఉండి కూడా అది సాధ్యపడనప్పుడు పొందే బాధను విరహము అంటారు.
 విని గమనము ప్రకారం ఇక్కడ తీసుకున్న ఒకే ఒక్క అంశము విరహము ఇది భర్త వైపు నుంచి చూసినా భార్య వైపు నుంచి చూసినా ఎలాంటి వైరుధ్యం కలగదు.ఒకే రకమైన భావోద్వేగాలు ఉంటాయనేది గమనించవచ్చు.
 దీనికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని చూద్దాం.
కాళిదాసు రచించిన "కుమార సంభవం" కావ్యంలో  శివుని కోసం పార్వతీ దేవి పడిన విరహ వేదనను కవి ఎంతో చక్కగా వర్ణించాడు.ఇందులో పార్వతీ దేవి యొక్క విరహ వేదనను పరీక్షించేందుకు వచ్చిన పరమేశ్వరుడితో ఆమె చెలికత్తెలు వివరించినట్లు  చెప్పిన పద్యం ఎంత బాగుందో ... మరి చూద్దామా..!
"త్రిభాగ శేషాసు నిశాసు చ క్షణం/నిమీల్య నేత్రే సహసా వ్యబుధ్యత/క్వ/నీల కంఠఃప్రజసీ త్యులక్ష్య వాక్/అసత్య కంఠార్పిత బాహు బంధనా!" 
 అనగా పార్వతీ దేవి అట రాత్రి అంతా శివుని గురించి ఆలోచిస్తూ నిద్ర లేకుండా గడుపుతుందట.అలా గడిపి చివరి ఘడియలో ఆ ధ్యాసలో ఉండగానే ఓ చిన్న కునుకు పడుతుంది.కానీ వెంటనే ఉలిక్కిపడి " ఏమయ్యా నీలకంఠా! ఎక్కడికి వెళ్ళి పోతున్నావు?"అంటూ ఎదుట లేని ఆ పరమేశ్వరుడిని నిద్రావస్థలోనే ఆలింగనం చేసుకుంటూ చటుక్కున మేల్కొంటుంది"అని చెలికత్తెలు చెబుతారు.
 " వినిగమన విరహం"లో ప్రేయసీ ప్రియులు కానీ, భార్యా భర్తలు కానీ ఎడబాటుతో తల్లడిల్లిన విధాన్ని పలువురు కవులు శృంగారాత్మకంగా వర్ణించడం, మరికొందరు గేయ రచయితలు మనసును తాకే విధంగా పాటలు రాయడం గమనించవచ్చు. ఉదాహరణకు   వేటూరి గారు రాసిన"ఆకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమా"  అంటూ రాసిన  పాట ప్రియుడు ప్రియురాలి కోసం  విరహ వేదనతో పాడటం గమనించవచ్చు.
 ఇలా "విని గమనాన్ని మన పెద్దవాళ్ళు విరహానికి   ఉపయోగించడంతో  పాటు వ్యక్తులు- తమ సమాజ హిత కార్యకలాపాలకు కూడా అన్వయించి చెప్పడం విశేషం.అదెలా అంటే కొంతమంది   ఏదో ఒక సమాజ హిత పని చేయకుండా ఉండలేరు. వాటి ఎడబాటును కూడా భరింలేరు. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకుఃటూ వినిగమన విరహ న్యాయమును ఏదైనా మంచిపని కోసం  వినియోగిస్తే బాగుంటుంది.పుణ్యం పురుషార్ధం  రెండూ లభిస్తాయి.అంతే కదండీ!

కామెంట్‌లు