సునంద భాషితం:- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయములు-688
వ్యక్తి న్యాయము
    *****
వ్యక్తి అనగా  మనుష్యుడు, పౌరుడు, నరుడు, మానవుడు,మర్త్యుడు మొదలైన అర్థాలు ఉన్నాయి.
ఒకానొక అర్థమందు రూఢమై యున్న  అనగా ప్రసిద్ధమైన, ఖ్యాతి చెందిన వ్యక్తిని గురించి మాట్లాడునపుడు లక్షణాదులచే మరొక వ్యక్తి కర్థము చేసి చెప్పడం అసంగతము. ఎందుకంటే ఒకనిని గూర్చిన ప్రస్తావమున తత్సమ లక్షణలక్షితుడు అయినంత మాత్రాన అప్రకృతుడవు వేరొకని విషయము స్వీకరించుట అసమంజసము కదా అని అర్థము.
ఉదాహరణకు ఈ వాక్యం చూద్దాం. "కౌశికో వాక్య మబ్రవీత్" అనే వాక్యము పలికినపుడు కౌశికుడు అనగా విశ్వామిత్రుడు ఇట్లనెను అనుటకు బదులుగా "దివాంధఃకౌశికోలూక..." అని నిఘంటువు ద్వారా గుడ్లగూబను గ్రహించి గుడ్లగూబ ఇట్లనెను అని గానీ; "కౌశికః కాకాన్ సంహరతి" గుడ్లగూబ కాకులను చంపుచున్నది అనునపుడు  "కుశిక స్యాపత్యం పుమాన్ కౌశికః " అను వ్యుత్పత్తిచే కౌశికుడు అనిన విశ్వామిత్రుడు కాకులను చంపుచున్నాడు అంటే అర్థమే  మారిపోతుంది.ఇలాంటి అర్థములు చెప్పుట అసంగతమని గ్రహించాలి.
 అనగా ఇక్కడ  గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒక వ్యక్తికి సంబంధించిన విషయాన్ని ప్రస్తావించేటప్పుడు ఆ వ్యక్తి గురించే మాట్లాడాలి.ఆ వ్యక్తి పేరు లాంటిదే కానీ ఇతర అర్థం  వ్యక్తి లేదా పశుపక్ష్యాదులతో  ఆ సందర్భం లేదా సంఘటనతో పోల్చి చూడటం అనేది విజ్ఞత కాదని అర్థం చేసుకోవచ్చు.
 పై వివరణలో చూసినట్లయితే కౌశిక అంటే విశ్వామిత్రుడు అనే అర్థంతో పాటు గుడ్లగూబ, ముంగిస అనే అర్థాలు ఉన్నాయి కదాని గుడ్లగూబకు సంబంధించిన విషయాన్ని  విశ్వామిత్రుడికి వర్తింపజేయడం అసంగతము  అంటే సందర్భ శూన్యం కదా! అందుకే ఒక వ్యక్తిని గురించి ప్రస్తావించేటప్పుడు మరొకరికి అన్వయించి చెప్పడం  సమంజసం కాదని గ్రహించాలి.
పై విషయాలన్నీ గమనించిన తర్వాత ఈ "వ్యక్తి న్యాయము" ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే  ఒక వ్యక్తికి సంబంధించిన విషయాన్ని గాని, మనస్తత్వాన్ని గానీ,మరొకటి లేదా మరొకరితో పోల్చి అన్వయించి చెప్పడం సరికాదని అర్థము.
 ముఖ్యంగా మన కుటుంబాల్లో  మరియు పాఠశాలల్లో కొందరు  పిల్లలను ఇతరులతో పోల్చి పొగడ్తనో,తెగడ్తనో చేస్తుంటారు. అలా చేయడం వల్ల మానసికంగా అహంకారమో, అత్యంత న్యూనతా భావమో వారిని వెంటాడుతూ వారి సర్వతోముఖాభివృద్ధికి పెద్ద అవరోధంగా నిలుస్తుంది.కాబట్టి  అలా పోల్చడం లేదా తప్పుగా అర్ధం చేసుకోవడం ఎప్పుడూ కూడదని మన పెద్దవాళ్ళు చెబుతూ ఈ "వ్యక్తి న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
కాబట్టి ఈ"వ్యక్తి న్యాయము" ద్వారా మనం గ్రహించాల్సిన నీతి ఏమిటంటే ఉత్పత్తి అర్థాలు, నిఘంటువు అర్థాలలో పర్యాయ పదాలుగా వచ్చిన వాటిని సందర్భోచితంగా  లేనప్పుడు ఎప్పుడూ ఉపయోగించకూడదు. ఈ విషయం సదా గమనంలో పెట్టుకొని ప్రసిద్ధ వ్యక్తులను   అప్రకృతుడు అనగా సాధారణము కానీ అసహజమైన మరియు సంస్కరింపబడని వ్యక్తితో  పోల్చడం,అన్వయించడం తగదని అర్థం చేసుకోవాలి.
 ఇదండీ !"వ్యక్తి న్యాయము" అంటే. ఎలాగూ విషయాలు, విశేషాలూ తెలిశాయి కదా. వీటిని ఎప్పుడూ గుర్తుంచుకుందాం!

కామెంట్‌లు