సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు-653
యథా క్రతు న్యాయము
*****
యథా అంటే కేవలం లేదా ఎలా,ఎట్లు అని అర్థము.క్రతు అనగా యాగము, యజ్ఞము అనే అర్థాలతో పాటు బ్రహ్మ  మానస పుత్రులలో ఒకడైన క్రతు అనే ఋషి పేరు.
క్రతువు అనేది బ్రహ్మస్వరూపం అయినట్లే క్రతువు నిర్వహించిన యజమాని కూడా బ్రహ్మ స్వరూపుడవుతాడని అర్థము.
అదెలా అంటే "అన్నం బ్రహ్మ"" అహం బ్రహ్మ"అనే వాక్యాల వలెనే "యజమానం బ్రహ్మే త్యుపాసీత","యజమాన రూపోనై" అనే వాక్యాల వలెనే అంటారు మన పెద్దలు.
 మరి ఈ క్రతు లేదా యాగం గురించి కొన్ని విషయాలు విశేషాలూ ప్రత్యేకతలు తెలుసుకుందాం.
యజ్ఞం లేదా క్రతువు హిందూ సంప్రదాయంలో ఎంతో విశిష్టమైనది. పూర్వకాలంలో అగ్ని,వాయు, వరుణుడు మొదలైన దేవుళ్ళతో పాటు,ఇంద్రుడు,అష్ట దిక్పాలకులను ప్రసన్నం చేసుకునేందుకు యజ్ఞ, యాగాదులు అనగా క్రతువులు నిర్వహించే వారు.
 గృహస్థాశ్రమంలో ఉన్న వారు యజ్ఞాలు చేస్తేనే పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
అయితే వీటిలో ముఖ్యమైనవి ఐదు ఉన్నాయి. వాటిని పంచ యజ్ఞాలు అంటారు. 
అవి ఒకటి బ్రహ్మ యజ్ఞం. రెండు దేవ యజ్ఞం. మూడు పితృ యజ్ఞం.నాలుగు భూత యజ్ఞం.ఐదు నృయజ్ఞం.
యథా క్రతు న్యాయములో ముఖ్యంగా మనం తెలుసుకోవలసిన యజ్ఞం "బ్రహ్మ యజ్ఞం".బ్రహ్మ యజ్ఞం అనగా వేదాధ్యయనం.ఈ యజ్ఞమును ఇంటి యజమాని అనగా గృహస్థుడు చేస్తాడు.ఈ యజ్ఞం ద్వారా ఎంతో జ్ఞానాన్ని ఆర్జిస్తాడు.తాను ఆర్జించిన జ్ఞానాన్ని అందరికీ పంచి పెడతాడు.వేదాధ్యయనంలో భాగంగా రామాయణం మహాభారతం భాగవతం మొదలైన ఉద్గ్రంథములను పఠించడం అన్న మాట.
ఇలా పఠిస్తూ, ఆర్జిస్తూ ఇతరులకు పంచిపెట్టే వ్యక్తి గురు సమానుడు అవుతాడు.గురువును ఎలాగైతే బ్రహ్మ అని అంటామో అలాగే బ్రహ్మ యజ్ఞం నిర్వహించే వ్యక్తేని కూడా సాక్షాత్తూ బ్రహ్మ స్వరూపం లేదా బ్రహ్మ అని అంటారు.ఇదంతా అగ్ని వద్ద వేదమంత్రాల సహితంగా  జరుగుతుంది.ఇందులో ఇంకా ఎన్నో నియమాలు నిబంధనలు మొదలైనవి సంప్రదాయంతో ముడిపడి వుంటాయి.వీటన్నింటినీ పాటిస్తూ బ్రహ్మ యజ్ఞం నిర్వహించే యజమాని లేదా గృహస్థును సాక్షాత్తూ బ్రహ్మ స్వరూపమే అనడంలో ఎలాంటి సందేహమూ లేదంటారు మన పెద్దవాళ్ళు.
 ఇక మరో క్రతువు గురించి కూడా పనిలో పనిగా తెలుసుకుందాం. అదే వివాహ క్రతువు. హిందువులు వివాహాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు.అందులోని ప్రతి  అంశాన్ని తు చ తప్పకుండా నియమ నిష్ఠలతో ఆచరించడం మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ కూడా వివాహానికి అగ్ని సాక్షిగా వుంటుంది. అగ్ని హోత్రం చుట్టూ వధువు చిటికెన వేలు పట్టుకుని మంత్ర సమన్వితంగా వరుడు ప్రదక్షిణలు చేస్తాడు.ఏడడుగులు నడుస్తాడు.కాబట్టి  వివాహాన్ని  క్రతువు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వివాహం జరుగబోయే వధూవరులను లక్ష్మీ దేవి, విష్ణువుగా కూడా భావించడం మనందరికీ తెలిసిందే.
 " మొత్తంగా ఈ న్యాయము"లో  మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే  ఎవరైతే బ్రహ్మ క్రతువు నిర్వహిస్తారో  వారు ఆ క్రతువుకు సంబంధించిన బ్రహ్మ స్వరూపులు అవుతారని అర్థము.
ఏమిటో ఇదంతా గందరగోళంగా ఉంది ఏం అర్థం కావడం లేదనిపిస్తే దీనిని ఇంకా తేలికగా అర్థం చేసుకోవడానికి చక్కని ఉదాహరణ ఏమిటంటే "అయ్యప్ప దీక్ష తీసుకున్న వారిని స్వామి అయ్యప్పలనీ, ఆంజనేయస్వామి దీక్ష చేపట్టిన వారిని  సాక్షాత్తూ  ఆంజనేయ స్వాములనీ ఆయా దైవాల స్వరూపంగా భావిస్తూ  వారికి పూజలు చేస్తూ వుండటం మనం చూస్తూనే ఉన్నాం.
ఇదంతా ఒక ఎత్తయితే  మనం చేసే మంచి, చెడు పనులతోనే దైవంగా గౌరవింపబడటమో, దెయ్యంగా దూషింపబడటమో జరుగుతుంది అనేది మనం సదా గుర్తుంచుకుంటే  ఈ "యథా క్రతు న్యాయము"నకు న్యాయము చేసినట్లవుతుంది.


కామెంట్‌లు