చిచ్చు పెట్టడం సులభం గురూ :-డా.ఎం.హరికిషన్-9441032212-కర్నూలు

  ఒక అడవిలో ఒక దొంగనక్క వుండేది. అది చానా తెలివైనది. ఎవరినైనా సరే తన మాయమాటలతో, ఎత్తులతో చిత్తు చేసేది. ఆ నక్క ఇంటి పక్కనే ఒక కుంటి కుక్క వుండేది. అది ఎప్పుడూ నక్క వెంబడే తిరుగుతా అది ఏమి చెబితే అది చేస్తా వుండేది. ఒక సారి ఆ కుంటికుక్క “మిత్రమా... నేను ఎప్పటి నుంచో ఒకటి నిన్ను అడగాలనుకుంటా వున్నాను. ఈ లోకంలో తమంత తెలివైనవాళ్ళు ఎవరూ లేరని మనుషులు విర్రవీగుతా వుంటారు గదా. నిజంగా వాళ్ళు అంత తెలివైన వాళ్ళేనా... నీ అభిప్రాయం చెప్పు” అనింది. 
దొంగనక్క చిరునవ్వు నవ్వి "నిజానికి మనుషుల్లో తెలివైనవాళ్ళు ఎక్కడో ఒకచోట వేళ్ళ మీద లెక్కబెట్టేంత మందే వుంటారు. వాళ్ళని విడగొట్టడం, పడగొట్టడం, మోసం చేయడం చాలా సులభం. వాళ్ళంత అసూయపరులు, అవివేకులు, స్వార్థపరులు, సొంత ఆలోచన లేని వాళ్ళు, నిజాన్ని తెలుసుకునే ఓపికని వాళ్ళు ఏడేడు పద్నాలుగు లోకాల్లో ఎక్కడ వెదికినా దొరకరు” అనింది.
ఆ మాటలకు కుంటికుక్క “ఎందుకో  కానీ నువ్వు చెప్పేది నాకు అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. నేను ఒకూరిలో ఇద్దరు స్నేహితులను చూపిస్తా. వాళ్ళది అలాంటిలాంటి స్నేహం కాదు. కంటికి కాటుక లెక్క, కాలికి కడియం లెక్క ఎప్పుడూ కలసిమెలసి వుంటారు. వాళ్ళని నీ మాయోపాయంతో విడగొట్టగలవా" అని అడిగింది.
దానికి దొంగనక్క నెమ్మదిగా తలూపుతా “శత్రువుల మధ్య గొడవ పెట్టడానికి ఒక అగ్గిపుల్ల చాలు. కానీ మిత్రులంటా వున్నావు. అదీ చిన్ననాటి జిగిరీలంటా వున్నావు. ఐనా ఈ లోకంలో ఏదీ అసాధ్యం కాదు. కొన్ని ఎక్కువ ఎత్తులు వేయాలంతే, చెప్పు ఎవరిని విడగొట్టాలి" అనింది.
అప్పుడాకుక్క "మన అడవికి ఉత్తరం వైపు ఒక వూరుంది. అక్కడ అందరూ మంచోళ్ళే. ఒకరితో ఒకరు బాగా కలసి మెలసి వుంటారు. కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, దొంగతనాలు, మోసం చేయడాలు అస్సలు వుండవు. ఏదయినా గొడవ జరిగినా వెంటనే పెద్దమనుషులు వచ్చి సర్ది చెబుతారు. అందరూ వాళ్ళ మాట వింటారు. గౌరవిస్తారు.
ఆ వూరిలో రాజయ్య, సుధాకర్ అని ఇద్దరు స్నేహితులు వున్నారు. పండగొచ్చినా, ఆపదొచ్చినా ఒకరికొకరు తోడునీడగా నిలబడతారు. అందరూ వాళ్ళిద్దరిని చూసి “ఆహా... స్నేహం అంటే మీదేరా. ఎప్పటికీ ఇట్లాగే కలసిమెలసి పాలూనీళ్ళ లెక్క జీవించండి" అని దీవించే వాళ్ళు. తలకిందులు తపస్సు చేసినా వాళ్ళని ఎవ్వరూ విడగొట్టలేరు" అనింది.
అప్పుడా దొంగనక్క చిరునవ్వు నవ్వుతా "ఎంత పెద్ద గడ్డి వామయినా సరే అంటించడానికి ఒక చిన్న అగ్గిపుల్ల చాలు. వాళ్ళిద్దరే కాదు మొత్తం పూరువూరే కొట్టుకొని సచ్చేటట్టు చేస్తాను చూస్తావా" అనింది.
“సరే.... నువ్వలా చేస్తే జీవితాంతం నీ కాళ్ళకాడే పడుండి, నువ్వెలా చెప్తే అట్లా చేస్తా. సరేనా" అనింది కుంటినక్క
దొంగనక్క పడిపడి నవ్వుతా “మరీ అంతొద్దులే గానీ... ముందు వాళ్ళిద్దరి వివరాలన్నీ ఒక్కటి గూడా విడవకుండా చెప్పు” అంటూ తనకు కావలసిన విషయాలన్నీ గుచ్చి గుచ్చి అడిగి రాబట్టింది. ఆ తరువాత రెండూ కలసి ఆ వూరి వైపు బైలుదేరాయి.
**********
సుధాకర్, రాజయ్య ఇండ్లు దూరం దూరంగా వున్నప్పటికీ పొలాలు మాత్రం పక్కపక్కనే వున్నాయి. రాజయ్య పొలంలో రెండు పెద్ద మామిడిచెట్లు వున్నాయి. అవి బాగా కాపుకొచ్చి రేపో ఎల్లుండో తెంపడానికి సిద్ధంగా వున్నాయి. ఆ పళ్ళు బాగా రుచిగా వుండడంతో కాయలన్నీ తెంపి తనకు అమ్మమని వూరిలో వుండే ఒక పెద్దమనిషి డబ్బులిచ్చి పోయాడు. దాంతో రాజయ్య తోటలో ఎవ్వరూ రాకుండా చుట్టూ బాగా కంచె వేయించి జాగ్రత్తగా చూసుకోసాగాడు.
దొంగనక్క సక్కగా పోయి రాజయ్య తోటలోకి దూరింది. మామిడిపళ్ళు మంచిగా మాగినేవి కోసుకొని కడుపు నిండా కమ్మగా తినింది. సుధాకర్ తోటలోకి పోయి ఒకచోట గుంత తీసి తిన్న తొక్కలు టెంకలు అన్నీ అందులో వేసి ఒక తొక్క మాత్రం సగం బైటకు కనబడేలా బూడ్చి పెట్టింది. కొన్ని పండ్లు బుట్ట నిండా నింపుకొని నెత్తిన పెట్టుకొని బైలుదేరింది.
సుధాకర్ పొలానికి ఒక్కడే పోతా వుంటే నక్క పళ్ళబుట్టతో ఎదురొచ్చి “అయ్యా... అడవి నుంచి కలకండ లాంటి తీయని దోరపళ్ళు తెచ్చినా, ముసలిదాన్ని వూర్లోకి పోయి అమ్ముకునేంత ఓపికలేదు. ఒక్క పండు కొరికి చూసి మీకు నచ్చితే తోచినంత ఇయ్యండి” అనింది. బాగా చవగ్గా తక్కువ ధరకే వస్తున్నాయి గదా అని సుధాకర్ దాని చేతిలో రెండొందలు పెట్టి ఆ గంప పళ్ళన్నీ తీసుకొని మరలా ఇంటికి పోయాడు.
కాసేపటికి రాజయ్య తోటలోకి వచ్చాడు. చూస్తే ఇంకేముంది మామిడిపళ్ళు లేవు. దొంగలెవరైనా వచ్చారా అని చుట్టూ చూశాడు, ఎట్లా వేసిన కంచె అట్లాగే వుంది. ఏమైపోయినాయబ్బా పండ్లన్నీ అని చుట్టూ చూస్తా వుంటే సుధాకర్ తోటలో సగం తొక్క ఎండకు మిలమిలమిల మెరుస్తా కనబడింది. పోయి తవ్వి చూశాడు. ఇంకేముంది లోపల తొక్క, టెంకలు కనబడ్డాయి. సుధాకరే తిన్నాడా లేక ఎవరైనా తిని తొక్కలు ఇక్కడ గుంత తీసి పెట్టారా అని ఆలోచించుకుంటా ఇంటికి బైలుదేరాడు. దారిలో సుధాకర్ చిన్న కూతురు అరుగు మీద కూర్చుని మామిడిపండు తినుకుంటా కనబడింది. ఆ పండు చూడగానే అది తన చెట్టుకు కాసిందే అని అర్థమయ్యింది. సుధాకర్ మీద పీకల వరకు కోపం వచ్చింది. కానీ స్నేహితున్ని ఏమీ అనలేక దాన్ని మనసులోనే అణచి పెట్టుకున్నాడు.
సాయంత్రం సుధాకర్ రాజయ్య వాళ్ళింటికొచ్చాడు. మాటల మధ్యలో “ఏం సుధాకర్ మామిడిపళ్ళు ఎలా వున్నాయి. మీ పాప తింటా వుంటే చూశా. ఎక్కడి నుంచి తెచ్చావు" అని అడిగాడు రాజయ్య. దానికి సుధాకర్ నవ్వుతా “అవా... పొద్దున్నే కొనుక్కొచ్చానులే. నెయ్యితో చేసిన మెత్తని మైసూరుపాకు లెక్క భలే తియ్యగున్నాయి" అన్నాడు.
ఆ మాటలకు రాజయ్య "వీడు దొంగతనం చేసింది గాక మళ్ళా కొనుక్కొచ్చినానని నా ముందే అబద్దాలు ఆడుతున్నాడు" అనుకొని కోపంగా "ఎందుకట్లా చేసిన తప్పు కప్పిపుచ్చుకుంటూ అబద్దాల మీద అబద్దాలు చెబుతావు. అడిగితే నేనే కోసిచ్చేటోన్ని గదా. ఐనా ఎవరికో అమ్మినవి అట్లా ఒక్కమాట గూడా చెప్పకుండా మట్టసంగా తిని రావడమేనా. కొంచం గూడా ముందు వెనుకా ఆలోచించేది లేదా” అన్నాడు.
సుధాకర్ కు ఆ మాటలతో మనసు చివుక్కుమంది. స్నేహితునితో గొడవ పడటం ఇష్టం లేక మారు మాట్లాడకుండా గమ్మున ఇంటికి వెళ్ళిపోయాడు. మనసంతా బాధతో నిండిపోయింది. “స్నేహితుడినని చూడకుండ ఎంత మాటన్నాడు. నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచీ కలసి మెలసి తిరుగుతున్నామే, నా గురించి ఆ మాత్రం తెలీదా.... థూ... థూ... ఇటువంటోనితోనా ఇన్నాళ్ళు స్నేహం చేసింది. ఇకపై సచ్చినా వాన్ని కన్నెత్తి చూడగూడదు, పన్నెత్తి పలకరియ్యగూడదు" అనుకున్నాడు. 
సుధాకర్ ఇంట్లో రెండు కోళ్ళున్నాయి. సుంకులమ్మకని వాటిని బాగా మేపుతున్నాడు. రాత్రి ఏ పిల్లో, కుక్కో తిని పోకుండా గంప కింద మూసిపెడతా వుంటాడు. నక్క ఆ రోజు రాత్రి నెమ్మదిగా లోపలికి దూరి ఆ రెండు కోళ్ళను ఎత్తుకుపోయి హాయిగా కూర చేసి సగం కుంటి కుక్కకి పెట్టింది. ఇంకా తెల్లారక ముందే ఆ కోడి బొచ్చు తీసుకొని పోయి రంగయ్య ఇంటి ముందున్న చెత్తకుండిలో వేసి, నాలుగు ఈకలు వాళ్ళ ఇంటి తలుపు ముందు పాడేసింది.
సుధాకర్ పొద్దున లేచి చూస్తే ఇంగేముంది కోళ్ళు లేవు. వురుక్కుంటా పోయి వీధి మొత్తం ఆ ములనుంచి ఈ మూల వరకు ఒకటికి నాలుగుసార్లు వెదికాదు. వూహూ ఎక్కడా లేవు. ఆఖరికి రాజయ్య ఇంటిముందు దిబ్బలో కనబడ్డాయి. వాళ్ళ వాకిలి దగ్గర కూడా కొన్ని ఈకలు పడున్నాయి. ముందురోజు రాజయ్య అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. తనను దెబ్బ కొట్టడం కోసం కోళ్ళు ఎత్తుకు పోయాడని అనుకున్నాడు.
కోపంతో మండిపోతూ విసురుగా ఇంట్లోకి పోయాడు. మంచమ్మీద పండుకున్న రాజయ్యతో “ఏంరా.... నీ మామిడికాయలు నేను తెంపలేదని నెత్తీనోరు కొట్టుకుని మొత్తుకున్నా నమ్మకుండా నా కోళ్ళు ఎత్తుకోనొచ్చి కూర చేసుకొని తింటావా. మనిషివా, పశువ్వా నువ్వు" అన్నాడు.
ఆ మాటలకు సుధాకర్ “వాయబ్బా... చూసినాంలే నీ ఎత్తులు. నువ్వు చేసిన మామిడికాయల దొంగతనం యాడ బైట పడతాడో ఏమో అని ముందుగానే నా మీద నిందలేస్తా వున్నావు. ఒకపక్క స్నేహితునిలా నటిస్తా మరొకపక్క గోతులు తవ్వడం నీ కొచ్చేమో గాని నాకు రాదు" అన్నాడు.
అంతే... మాటా మాటా పెరిగిపోయింది. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అంటూ నోటికొచ్చినట్టు తిట్టుకోసాగారు. ఇదంతా చూస్తా వున్న రాజయ్య పెళ్ళాం గొడవ ఇలాగే పెరిగిపోతే ఏమవుతుందో ఏమో అని భయపడి "అనా నా మాటిని ముందింటికి పో, తరువాత మాట్లాడుకుందాం. నిజంగా నీ కోళ్ల సంగతి మాకెవరికీ తెలీదు" అంటూ సుధాకర్ చేయి పట్టుకొని పక్కకు లాగింది.
సుధాకర్ కోపంగా "పిల్లికి ఎలుక సాక్ష్యమని.... నీ మొగుడు తప్పు చేసినా బుద్ది చెప్పకుండా వెనకేసుకొస్తున్నావు. కొంచమన్నా సిగ్గుండాల మనిషి పుట్టుక పుట్టినాక” అంటూ చీదరింపుగా చెయ్యి విదిలించుకున్నాడు.
అది చూసిన రాజయ్య "ఏరా... ఎన్నిసార్లు ఈ ఇంట్లో కూచోని లొట్టలేసుకుంటా నా పెండ్లాం చేతి వంట తిన్నావు. వదినలాంటి దాన్ని పట్టుకొని సిగ్గులేదా అని తిడతావా. పోరా నా ఇంట్లోంచి బైటకు ముందు" అంటూ మెడ పట్టుకొని విసురుగా ముందుకు తోశాడు.
అదే సమయంలో వాళ్ళ గొడవ గురించి తెలిసి అక్కడికి సుధాకర్ కొడుకులు వురుక్కుంటా వచ్చారు. తమ కళ్ళముందే తమ తండ్రి వీధిలో కొచ్చి దభీమని పడడం చూసి వాళ్ళ రక్తం సలసలసల మరిగిపోయింది.
“మా నాన్ననే కొడతావా... ఎంత ధైర్యంరా నీకు” అంటూ ఇంట్లోకి దూరి రాజయ్యను పట్టుకొని వీధిలోకి ఈడ్చుకొని వచ్చి కిందా మీదా పడేసి తన్నసాగారు.
సుధాకర్ ఇంటి పక్కనే పెద్ద సుంకన్న వుంటాడు. ఆయన ఊర్లోని పెద్దమనుషుల్లో ఒకడు. వాళ్ళ కులం వాళ్ళకు ఆయన మాటంటే వేదం. ఎవరికి ఏ సమస్య వచ్చినా పరుగెత్తుకుంటూ పంచాయితీకి అయన దగ్గరికే వస్తుంటారు. ఆయన ఎలా చెబితే అలా నడుచుకుంటూ వుంటారు.
కళ్ళ ముందే సుధాకర్ కొడుకులు రాజయ్యను పట్టుకొని తంతావుంటే సుంకన్న చూడలేకపోయాడు. “రేయ్.... కొంచమన్నా చిన్నా పెద్దా వుందా. మీ నాయన వయసోన్ని పట్టుకొని అట్లా తంతా వున్నారు. పోతారా లేదా ఇక్కడి నుంచి” అంటూ వాళ్ళ మధ్యలో దూరాడు. సందులో ఒక అంగడి వెనుక దాచిపెట్టుకొని ఇదంతా చూస్తా వున్న దొంగనక్క ఒక మంచి లావు రాయి తీసుకొని ఆ కులపెద్దను ఈడ్చి ఒకటి పెరికింది. అంతే తల టప్పుమని చిట్లి రక్తం బొటబొటబొట కారి తెల్ల అంగీ కాస్తా ఎర్రగయింది. అది చూసిన ఆయన పెళ్ళాం సుధాకర్ కొడుకులే ఆమె మొగున్ని కొట్టినారనుకొని "రేయ్... మీ నాయకున్ని మీ కళ్ళ ముందే కొట్టి చంపుతా వుంటే చూస్తా వూరుకున్నారేంరా.... పొండి... పోయి మన కులమోళ్ళందరినీ 
పిలుచుకొని రాపోండి. ఈరోజు వాల్లో మనమో అటో యిటో తేలిపోవాల" అంటా గట్టిగా అరిచింది. అంతే అక్కడున్న చిన్నపిల్లలు కొందరు అందరినీ పిలుచుకొని రావడానికి తలా ఒక దిక్కుకు పూర్లోకి పరుగెత్తినారు.
నక్క వెంటనే కొంచం ఎర్రరంగు ఒంటికి పూసుకొని సుధాకర్ కులం వాళ్ళు వుండే వీధివైపు వురుకుతా పోయింది. అదట్లా గసబెడతా ఉరుకుతా వుంటే చూసిన ఒకడు “ఏమైంది... ఎందుకట్లా వురుకుతా వున్నావు. నీ వళ్ళంతా ఆ రక్తం ఏంది" అని అడిగాడు. దానికా నక్క "పోండి... పోండి... వెంటనే అందరూ ఇళ్ళలోకి పారిపోయి తలుపులేసుకొని గట్టిగా గొళ్ళాలు పెట్టుకోండి. సుంకన్న కులమోళ్ళు కత్తులు, కట్టెలు తీసుకొని మీ కులమోళ్ళనందరినీ వీధుల్లో వెంటబడి సంపుతా వున్నారు. దొరికినారనుకో పచ్చడి పచ్చడి అయిపోతారు. మీవోన్ని ఒకన్ని చంపుతా వుంటే అయ్యో పాపం అని ఆపడానికి పోతే నన్నిట్లా చావగొట్టారు" అనింది దొంగ ఏడుపు ఏడుస్తా.
ఆ మాటలింటానే అందరూ అదిరిపడ్డారు. “ఏందీ... మన కులమోళ్ళని వురికిచ్చి వురికిచ్చి కొడతా వున్నారా... మేమేమన్నా చేతగాని యదవలమా చూస్తా వుండడానికి. రండ్రా మన బలమేందో మనమూ చూపిద్దాం" అంటూ తలా ఒక కట్టె తీసుకొని వీధుల్లోకి ఉరికారు.
నిమిషాల్లో అక్కడంతా రణరంగంగా మారిపోయింది. కట్టెలు, కత్తులు పైకి లేచాయి. తలలు పగిలాయి. ఊరంతా రెండు వర్గాలుగా చీలిపోయింది. వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి కొందరు ఒక కులానికి మరికొందరు మరొక కులానికి మద్దతు పలికారు. చూస్తుండగానే వూరంతా అంటుకుపోయింది. పొగ పైకి లేచింది.
దొంగనక్క చిరునవ్వుతో కుంటికుక్క వైపు చూసి “ఇప్పుడర్థమైందా ఈ మూర్ఖుల మధ్య ఎంత సులభంగా గొడవలు పెట్టవచ్చో" అంది. కుంటికుక్క చేతులెత్తి నమస్కారం చేస్తా “నిజమే... వీళ్ళ మధ్య గొడవలు పెట్టడానికి పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు. నిజాలు తెలుసుకోవాలనే ఓపిక గానీ, నిర్ధారించుకొనే తెలివి గానీ వీళ్ళలో చాలా మందికి లేవు” అంది.
“సరే... సరే... ఇక పోదాం పద. రాత్రంతా నిద్రలేదు. అడవికి పోయి మిగిలిన కోడికూర కమ్మగా తిని పడుకుందాం. లేచేసరికి వూరు వల్లకాడు అయిపోతుంది” అంది.
ఏమో అనుకుంటి గానీ ... మనుషుల్లో చానామంది ఉత్త యెడవలె అనుకుంటా కుక్క నక్కతో బాటు అడవివైపు అడుగులేసింది.
***********

కామెంట్‌లు