అమ్మలా పరిపాలించాలి!!;- డా.ప్రతాప్ కౌటిళ్యా
జాతిని కాపాడుకోవడానికి 
పునరుత్పత్తి అవసరం. 
భాషను కాపాడుకోవడానికి 
పునరుత్పత్తి అవసరం. 
సంస్కృతిని కాపాడుకోవడానికి 
పునరుత్పత్తి అవసరం. 
చరిత్రను కాపాడుకోవడానికి 
పునరుత్పత్తి అవసరం. 
విజ్ఞానాన్ని కాపాడుకోవడానికి 
పునరుత్పత్తి అవసరం. 
అంటే ఒక అమ్మ కావాలి.!!!

నీవు దేశాధినేత వవుతావు
అధికారి అవుతావు 
గొప్ప ప్రపంచ నాయకుడివి అవుతావు 
కానీ నీవు అమ్మవు కావాలి 
అమ్మలా పరిపాలించాలి.!!!

అమ్మంటే నమ్మకం 
అమ్మంటే ప్రేమ 
అమ్మంటే త్యాగం 
అమ్మంటే అనురాగం 
అమ్మంటే ప్రజాస్వామ్యం 
అమ్మంటే సామ్యవాదం 
అమ్మంటే సమసమాజం!!!

నీ దగ్గర ధనముంది 
నీ దగ్గర అధికారం ఉంది 
నీ దగ్గర కీర్తి ఉంది 
నీ దగ్గర ప్రతిభ ఉంది 
నీ దగ్గర విజ్ఞానం ఉంది. 
కానీ 
నా దగ్గర అమ్మ ఉంది 
అమ్మ అవన్నీ సృష్టిస్తుంది.!!!

ఎక్కడ అమ్మ ఉంటుందో 
అక్కడ ఆనందం ఉంటుంది 
ఎక్కడ అమ్మ ఉంటుందో 
అక్కడ స్వేచ్ఛ ఉంటుంది 
ఎక్కడ అమ్మ ఉంటుందో 
అక్కడ స్నేహమంటుంది 
ఎక్కడ అమ్మ ఉంటుందో 
అక్కడ ధైర్యం ఉంటుంది 
ఎక్కడ అమ్మ ఉంటుందో 
అక్కడ ఆత్మవిశ్వాసం ఉంటుంది.!!!

వ్యక్తిత్వ వికాసంలో 
సానుకూల ఆలోచనలు అమ్మ 
రాజనీతి శాస్త్రంలో 
నీతి అమ్మ 
న్యాయ శాస్త్రంలో 
న్యాయం అమ్మ 
పరిణామ క్రమంలో 
ఒక జెనెటికల్ ఙ్ఞాపకం అమ్మ!!!

అమ్మంటే ఆకలి 
అమ్మంటే పునరుత్పత్తి 
అమ్మంటే సంరక్షణ 
అమ్మంటే అనుకూలం 

అమ్మకు కులం లేదు 
మతం లేదు వర్గం లేదు వివక్ష లేదు. 
అమ్మంటే గుండెల్లో దేవత 
కళ్లకు కనిపించే సజీవ దేవత. 

అమ్మ కలలు కనదు 
మనల్ని కంటుంది
అమ్మకు మనమే అమూల్యం 
మనమే ముఖ్యం 
అమ్మ జగతికి మూలం.

అమ్మ పురస్కార సభలో చదివిన కవిత. 

డా.ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు