సునంద భాషితం :-వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -701
శత పత్ర శాతన న్యాయము
******
శత అనగా వంద,నూరు. పత్ర అనగా ఆకు, వ్రాయుటకు ఉపయోగించు కాగితము, పత్రము,లేఖ,రెక్క,ఈక, ముఖమునకు సౌందర్య దాయకమగు పూత,కత్తి అంచు,కత్తి.శాతన అనగా పదును పెట్టే చర్య, ఆయుధాలను కత్తిరించడం,ఒక నాశనం లేదా నిర్మూలన, సుఖము వాడి చేయబడినది, కృశించినది.
 శత పత్ర శాతన అనగా వంద ఆకులను కత్తిరించడం లేదా నాశనం చేయడం,నిర్మూలించుట అనేది మామూలు అర్థము.
 అయితే ఈ న్యాయములో రెండు రకాలైన కోణాలు దాగి ఉన్నాయి.ఒకటేమో వంద ఆకులను ఒకేసారి కత్తిరించడం.మరొక అర్థములో వంద తప్పుల వరకు క్షమించడం అనేది సహనానికి పరీక్ష లాంటిదన్న మాట.వంద దాటిన తర్వాత చేసిన తప్పుకు తగిన శిక్ష వేయడం అనే అర్థంతో ఈ న్యాయమును మన పెద్దలు ఉదాహరణగా చెబుతుంటారు.
 వంద ఆకులను కత్తిరించడం అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే పెద్ద పెద్ద  ఆకులైనా మడతలు మడతలుగా పెట్టిన తర్వాత కూడా కత్తిరించడం కొంత కష్టమైన పనే.దానికి బాగా అభ్యాసం చేస్తే సాధ్యమవుతుంది.ఇదిఅందరికీ తెలిసిందే.అయితే ఆకులను  ఎందుకోసం కత్తిరించారు మంచికా చెడుకా అనేది గమనంలో పెట్టుకోవాలి.
ఇక శత తప్పిదాల విషయానికి వస్తే ఎవరు చేశారు?అతనికి పడిన శిక్ష ఏమిటో చూద్దాం.
 శత తప్పిదాలు చేసిన వ్యక్తి శిశుపాలుడు.వంద తర్వాత తప్పుకు శిక్ష వేసిన వాడు శ్రీకృష్ణుడు.ఆ కథేమిటో తెలుసుకుందాం.
 శిశుపాలుడు కృష్ణుడికి స్వయానా మేనత్త కొడుకు.సాత్వతి,దమ ఘోషలు శిశుపాలుని తల్లిదండ్రులు.ఇతడు పుట్టినప్పుడు వికృత రూపంలో అనగా మూడు కళ్ళతో, నాలుగు చేతులతో జన్మించాడు.అతడి రూపం చూసి తల్లిదండ్రులు భయపడిపోయారు.అయితే ఆ శిశువును ఎవరైతే ఎత్తుకుంటే ఆ చేతులు,కన్ను అదృశ్యమై పోతాయో ఆ వ్యక్తి చేతిలోనే మరణం సంభవిస్తుందని అశరీరవాణి పలుకుతుంది.
అతడిని చూడటానికి వచ్చిన రాందరినీ ఎత్తుకొమ్మని చేతికి ఇచ్చేవారు. అలా ఎవరు ఎత్తుకున్నా అతడి వికృత రూపం మాత్రం పోలేదు.
రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఆ బాలుడిని చూడటానికి  బలరామ కృష్ణులు వారి మేనత్త రాజ్యం ఛేదికి వస్తారు. ఎప్ఫటి లాగే  వారు రాగానే తల్లి ఆ శిశువును ఎత్తుకొమ్మని వారికి ఇస్తుంది. శ్రీకృష్ణుడు ఎత్తుకున్న వెంటనే  ఆ శిశువుకు ఉన్న అదనపు కన్ను, మరియు చేతులు మాయమై పోతాయి. వికృత రూపం పోయి సాధారణ రూపం వచ్చిన కొడుకును చూసి సంతోషపడుతూనే మరోపక్క తన మేనల్లుడి చేతిలో కొడుకు మరణిస్తాడని భయపడి పోయింది.తనకు పుత్ర పెట్టమని వేడుకుంటుంది.వంద తప్పుల వరకు క్షమిస్తాను.ఆ తర్వాత తప్పు చేస్తే శిక్ష వుంటుందని మేనత్తకు అభయం ఇస్తాడు.
అహంకారం గల శిశుపాలుడు తనకు తిరుగులేదని గర్వంతో రకరకాల తప్పిదాలు చేస్తాడు.అయితే ధర్మరాజు తలపెట్టిన రాజసూయ యాగంలో చేధి రాజ్యానికి వచ్చిన భీముడిని గౌరవంగా చూస్తాడు. అర్ఘ్యం తీసుకునే సమయంలో మొదటి ఆర్ఘ్యాన్ని శ్రీకృష్ణుడికి ఇస్తుంటే శిశుపాలుడు అతడో గొల్లవాడు అతడికి అర్ఘ్యం  ఇవ్వొద్దని అభ్యంతర పెట్టడమే కాకుండా  నోటికి వచ్చినట్లు తిడుతాడు. ఆవిధంగా మొత్తం వంద తప్పులను చేసిన శిశుపాలుడిని తన సుదర్శన చక్రంతో సంహరిస్తాడు.అలా వంద తప్పులు చేసిన శిశుపాలుడు శ్రీకృష్ణుడి చేతిలో హతమవుతాడు.
 ముందు చెప్పినట్లుగా మొదటి కోణంలో ఓ సున్నితత్వాన్ని చిదిమి వేయడం అనే దుర్గుణం మనకు కనిపిస్తుంది.పదునైన ఆయుధంతో వంద ఆకులను  కత్తిరించిన  వ్యక్తి  మనస్తత్వం కఠినమైనదనీ,అటువంటి వ్యక్తులను దూరంగా ఉంచాలని లేదా ఉండాలని అర్థము చేసుకోవాలి.
అలాగే శిశుపాలుని విషయానికి వస్తే సహనానికి కూడా ఒక హద్దు వుంటుందనీ ఆ హద్దుకు పరీక్ష పెడితే ఇక క్షమాపణలకు తావుండదని శిశుపాలుని కథ ద్వారా తెలుసుకున్నాం.
ఇదండీ!ఈ "శత పత్ర శాతన న్యాయము" లోని విషయము. మంచికి దగ్గరగా చెడుకు దూరంగా ఉండాలని, సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందని అది దాటితే పర్యవసనాలు ఎలా ఉంటాయో ఈ న్యాయము ద్వారా మనం గ్రహించాల్సిన నీతి.

కామెంట్‌లు