న్యాయాలు-702
శబ్ద సుఖాశ్రిత కురంగ గతి న్యాయము
******
శబ్ద అనగా ధ్వని, పదము. సుఖాశ్రిత అనగా అనాయసమగు ఆశ్రయం ఇచ్చుట,సంతోష జనకమగు ఆశ్రయం పొందేవారు, సుఖమును ఆశ్రయించిన వాడు. కురంగ అనగా ఇఱి,హరిణము, జింక.గతి అనగా కదలిక గమనము, ప్రవేశము, అవకాశము, చర్య, చీరుట భాగ్యము ,పరిస్థితి, దశ మార్గము, ఆశ్రయము, వెడలుట ,యాత్ర సంఘటన ,నక్షత్ర మార్గము, గ్రహ గమనము, జ్ఞానము, పునర్జన్మ ,జీవన దశ ఇలా అనేక అర్థాలు ఉన్నాయి.
మరి జింకలకు సునాయాస మరణానికి ఉన్న సంబంధం ఏమిటో తెలియజేయడమే ఈ న్యాయము యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
జింక అనగానే మనకు రామాయణంలో సీత కోరుకున్న బంగారు జింక కళ్ళలో మెదులుతుంది.
జింక లేదా హరిణము చూపరులను ఆకర్షించే సుందరమైన మృగం.చంచలమైన కళ్ళలో భయం బెదురు కనపడుతుంటే అయ్యో పాపం అనిపిస్తుంది.మరి ఆ జింకల గురించి తెలుసుకుందాం.
జింకల్లో నీటి జింకలను మినహాయించి అన్ని మగ జింకలకు కొమ్ములు ఉంటాయి. ఒకవేళ ఉన్నా మగ జింకలకొమ్ములంత పెద్దవిగా ఉండవు. జింకలు శాఖాహారులు. జింక గర్భధారణ కాలం పది నెలల వరకు ఉంటుంది. జింక పిల్ల పుట్టిన ఇరవై నిమిషాలలో అడుగులు వేయడం ప్రారంభిస్తుంది. తన తల్లితో కలిసి నడిచేంత బలంగా ఉండే వరకు ఒక వారం రోజుల పాటు గడ్డిలో దాగి వుంటుంది.జింక తన పిల్ల జింక సంవత్సరం పాటు కలిసి తిరుగుతాయి.
పురాతన శిలాయుగం నుంచి మరియు వేదాలలోని ఋగ్వేదంలోనూ, బైబిలులోనూ జింకల ప్రస్తావన ఉంది.
పూర్వ కాలంలో జింకలను ఉద్యానవనాలకు ఆభరణాలుగా పెంచేవారు.
రామాయణం అనేక మలుపులు తిరగడానికి జింకే కారణమని మనందరికీ తెలుసు.సీతారామ లక్ష్మణులు చేస్తున్న సమయంలో శూర్పణఖ రాముని మోహించడం. రాముడు లక్ష్మణుడు శూర్పణఖ కోరికను కాదనడం.కోపంతో సీతపై దాడి చేయబోతుంటే అన్న ఆజ్ఞతో శూర్పణఖ ముక్కు చెవులు కోయడం, రావణాసురుడి దగ్గరకు వెళ్ళి సీత సౌందర్యం వర్ణించి చెరపట్టమనడం, రావణుడు రాక్షసుడైన మారీచుని సీతాపహరణలో తోడ్పడమని అడగడం. అప్పుడు మారీచుడు చెప్పిన హితవు తలకు ఎక్కించుకోకుండా మారీచుని చంపుతానని బెదిరిస్తే, రావణాసురుడి చేతిలో చావడం కంటే రాముడి చేతిలో చచ్చిపోతే పుణ్యమైనా వస్తుందని చెప్పి బంగారు జింకగా మారిపోయి రాముని చేతిలో బాణపు దెబ్బ తిని తాను పొందాలనుకున్న సునాయ మరణం పొందుతుంది.
ఈ రామాయణంలో ప్రస్తావించిన ఋష్యశృంగుడి జన్మ వృత్తాంతంలో జింక పాత్ర ఉంది.తన తండ్రి విభాండక మహర్షి వీర్యాన్ని త్రాగిన జింక గర్భం ధరించడం వల్ల కొమ్ము గల బాలకుడిగా జన్మిస్తాడనీ, అందుకే అతడిని ఋష్యశృంగుడు పేరు పెడతాడు . అతడిని బాహ్య ప్రపంచం అంటే ఏమిటో తెలియకుండా పెంచుతాడు.సకల విద్యలు,వేద వేదాంగాలు, యజ్ఞ యాగాది క్రతువులు నేర్పుతాడు.అలాంటి ఋష్యశృంగుడు ఎక్కడ ఉంటే అక్కడ పుష్కలంగా వర్షాలు కురుస్తాయని అంటారు. దశరథ మహారాజుతో పుత్రకామేష్టి యాగం చేయిస్తాడు.ఆ యాగానంతరమే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మిస్తారు.
అలా ఋష్యశృంగుడు చేయించిన యాగం వల్ల జన్మించిన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు మళ్ళీ ఓ జింక పేరుతోనే దశరథునికి దూరం కావడం విశేషం.
శబ్ధభేది విద్య తెలిసిన దశరథుడు వేటకు వెళ్ళిన సమయంలో ముని కుమారుడైన శ్రవణుడు కొలనులో నీళ్ళు ముంచుతున్న శబ్దం విని జింకగా పొరబడి బాణం వేయడంతో ముని కుమారుడు మరణిస్తూ అంధులైన తల్లిదండ్రులు దాహంతో ఉన్నారు వారికి ఇవ్వమని చెప్పి మరణిస్తాడు. దశరథుడు నీటిని వాళ్ళకు ఇస్తూ విషయం చెప్పడంతో మరణ సమయంలో నీకు నీ పిల్లలు చెంత ఉండరని శపించి వారు తనువు చాలించారు. ఆ శాప ఫలితమే కైకేయి కోరిన వరాలు, రాముడు అరణ్యవాసం చేస్తూ వుండటం వల్ల మరణ సమయంలో ఎవరూ లేని ఒంటరిగా మరణిస్తాడు దశరథుడు.
ఇక జింకను ఆధ్యాత్మిక వాదులు సౌమ్యత, శాంతి, ప్రకృతితో సంబంధం, అంతర్ దృష్టి , సున్నితత్వం, పరివర్తన,కొత్త ఆరంభానికి సంకేతంగా భావిస్తారు.అంతే కాకుండా జింకలను దూతలు లేదా మార్గదర్శకులుగా చూస్తారు.
ఈ విధంగా జింక మానవ చరిత్రలో భాగమై పోయింది.ఆధ్యాత్మికంగా కూడా ప్రముఖమైంది.
"శబ్ద సుఖాశ్రిత కురంగ న్యాయము"లో మనం ఎన్నో విషయాలు విశేషాలూ ప్రత్యేకతలు తెలుసుకున్నాం.ముఖ్యంగా జింక అన్ని మంచి విలువల భౌతిక, ఆధ్యాత్మిక విలువల సంకేతమని అర్థం చేసుకున్నాం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి