తిరుమలరావుకు భీమిలి కళాసాహితి సత్కారం

 శ్రీకాకుళం జిల్లా, కొత్తూరు మండలం, కడుము పాతపొన్నుటూరు పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావును భీమునిపట్నం కళాసాహితి ఘనంగా సత్కరించింది. కవులు, కథకులతో ఉత్తరాంధ్ర స్థాయిలో నిర్వహించిన సదస్సులో ఆయన ఈ సత్కారం పొందారు. భీమునిపట్నం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో తిరుమలరావు పాల్గొని సాహిత్య అంశాలను పాలుపంచుకున్నారు.
అనంతరం తిరుమలరావును అభినందిస్తూ కళాసాహితి అధ్యక్షులు పి.ఆర్.పి.వర్మ, ప్రధాన కార్యదర్శి ఎ.సన్యాసిరాజు, కోశాధికారి కాళ్ళ సన్యాసిరావు, ఉపాధ్యక్షులు ఎం.కోటయ్య, కె.రామునాయుడు, పి.సురేష్, ఎం.లక్ష్మణరావు, ఎన్.జోగారావు, కార్యదర్శులు ఎం.కిశోర్, ఎం.సూర్యశ్రీనివాస్, పి.అరవింద్, కె.అప్పారావు, ఎల్.ఆదినారాయణలు ఘనంగా సత్కరించారు. నేటి కార్యక్రమంలో ప్రముఖ కవులు కథారచయితలైన కె.రామమోహనరావు, పోలిపల్లి శ్రీనివాసరావు, బి.లక్ష్మీగాయత్రి, ఎం.సుగుణారావులు రచించిన ఎదురులేని ఏడు, పోలిపల్లి మాట పూలబాట మకుటంతో పోలిపల్లి శతకం, పెళ్లి పుస్తకం, ఫైనల్ డయాగ్నోసిస్ అనే పుస్తకాలను ఆవిష్కరించగా ఆ పుస్తకాలను బహూకరిస్తూ తిరుమలరావును సత్కరించారు. 
ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ముప్పది ఎనిమిదేళ్ల క్రితం ఈ భీమునిపట్నంలో తిరుమలరావు ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ గావించారని, ప్రభుత్వ ఉద్యోగిగా నియామకం పొందిన అనంతరం విద్యార్థులకు గుణాత్మక విద్యను అందజేస్తూ జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని పొంది గర్వకారణంగా నిలిచారని అన్నారు. అదనపు సమయాల్లో రచయితగా చిత్రకారునిగా గాయకునిగా నటునిగా సమాజ సేవకునిగా నిరంతరం కృషి చేస్తూ పెక్కు సత్ఫలితాలను సాధించుట మిక్కిలి అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పడెం భానుమూర్తి, లంక వెంకటస్వామి, పి.ఎస్.ఎస్.లక్ష్మి, మాధవి సనారా, మల్లీశ్వరి, లక్ష్మి, మరువాడ భానోజీరావు, కొయిలాడ రామమోహనరావు, దామరాజు విశాలాక్షి, రేపల్లె ఈశ్వరరావు, కట్టమూరి పద్మనాభస్వామి తదితరులు తిరుమలరావుతో పాటు ప్రత్యేక ప్రసంగం చేసారు. అనంతరం కళా సాహితీ సభ్యుల పర్యవేక్షణలతో భీమునిపట్నంలో 1861నాటి తొలి పురపాలక సంస్థ, ఓడరేవుగా ఉన్నప్పటి సిగ్నల్ హౌస్, 17వ శతాబ్దంనాటి డచ్చిపాలకుల సమాధులు, చోళులకాలంనాటి పదహారు గుడుల భీమేశ్వర ఆలయం, కొండపై 1013సంవత్సరఃలో పునరుద్ధరణంటూ తెలిపే ఫలకం గల మండపం, కొండపై లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, హీనయానం నాటి పావురాల కొండ, ఎర్రమట్టి దిబ్బలు, చలం కుమార్తె సౌరీస్ జ్ఞానమందిరం, గోస్తనీనది బంగాళాఖాతంలో కలిసే సాగరతీరం, గడియార స్థంభం, లైట్ హౌస్, గుడిపాటి వెంకటాచలం బేసిక్ టీచర్ ట్రైనింగ్ పాఠశాలయే నేడు మారిన జిల్లా విద్యా శిక్షణా సంస్థ డైట్ తదితర పర్యాటక ప్రదేశాలను ప్రత్యేక బస్సులో రచయితలందరికీ సందర్శన గావించారు. గైడ్స్ గా ఎ.కిశోర్, పి.శ్రీనివాసరావులు వ్యవహరించి ఆ ప్రదేశాల విశిష్టతలను వివరించారు. బస్సులోను, సభావేదికపైన తిరుమలరావు ప్రత్యేక గీతాలను ఆలపించి అందరి ప్రశంసలు పొందారు.
కామెంట్‌లు