ఓ కవిమనసు:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం
కమ్మనైన కవితనొకటి
కూర్చాలని ఉన్నది
సాహితీప్రియులను తట్టి
లేపాలని ఉన్నది

రమ్యమైన భావమొకటి
పుటలపైపెట్టాలని ఉన్నది
పాఠకులను భ్రమలలోనికి
నెట్టాలని ఉన్నది

అందమైన ప్రకృతిని
అక్షరీకరించాలని ఉన్నది
చదువరులను మెప్పించి
శిరసులలోనిలవాలని ఉన్నది

చక్కనైన పూలకయితని
సృష్టించాలని ఉన్నది
సుమసౌరభాలను చల్లి
సంతసపరచాలని ఉన్నది

రుచియైన కవనవిందుని
శుచిగావడ్డించాలని ఉన్నది
అక్షరాభిమానులను ఆహ్వానించి
ఆరగింపజేయాలని ఉన్నది

శ్రావ్యమైన కైతనొకటి
ఆలపించాలని ఉన్నది
కోకిలా కుహూకుహూలని
తలపించాలని ఉన్నది

సాహిత్యరంగమందు సుదూరపయనాన్ని 
సాగించాలని ఉన్నది
కవనసూర్యుని కిరణాలని
ఖండాలందు ప్రసరించాలని ఉన్నది


కామెంట్‌లు