కాకతీయ కళాతోరణ నమూనాకు పుట్టినిల్లు...వల్లాల:-సుంకి. సాత్విక్ -ఎనిమిదవ తరగతి -ఆదర్శ పాఠశాల వల్లాల
 మా ఊరు పేరు వల్లాల. మా ఊరు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఊరు. ఎందుకంటే క్రీస్తుశకం  1098 నాటి శాసనం మా గ్రామంలో ఉన్నది. ఇప్పుడు ఈ శాసనాన్ని పానగల్ మ్యూజియంలో భద్రపరిచారు.ఈ శాసనం ప్రకారం కాకతీయ సామంత రాజులైన కందూరి చోడులు మా ఊరును పరిపాలించారు. వీరి కాలంలోనే చెరువు దగ్గరలో ఒక చక్కని కళాతోరణాన్ని నిర్మించారు. ఈ తోరణాన్ని ప్రేరణగా తీసుకొని వరంగల్ కోటలోని కాకతీయ కళా తోరణాలను నిర్మించారని చరిత్ర చెబుతుంది. ఈ తోరణం 20 అడుగుల ఎత్తులో ఉండి ఏకశిలతో నిర్మితమైంది. ఈ తోరణంపై రెండువైపులా శ్రీ మహా విష్ణువు విగ్రహాలు,ఏనుగులతో పాటు అద్భుతమైన శిల్పకళా సంపదను చెక్కి ఉన్నారు.ప్రతి సంవత్సరం బతుకమ్మ ఉత్సవాలను ఈతోరణం వద్దనే నిర్వహిస్తారు. కందూరి చోడుల కాలంలో తోరణం దగ్గరలో కేశవాలయం నిర్మించారు. ప్రస్తుతం ఇది శిథిలావస్థలో ఉంది.ఈ ఆలయానికి  సంబంధించిన భాగాలు అన్నీ భూమిలో కూరుకొనిపోయి ఉన్నాయి. 
         మాగ్రామంలో ఉన్న మరొక చారిత్రక కట్టడం పురాతన శివాలయం.ఇది కూడా కందూరి చోడుల కాలం నాటిదే.మాగ్రామంలో శివరాత్రి సందర్భంగా నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అందువలన మా ఊరు ఒక ఊరు మాత్రమే కాదు..... ఒక రాజ్యపాలనా కేంద్రం. చారిత్రక నిలయం. కాకతీయ కళాతోరణ నమూనాకు పుట్టినిల్లు.మత సామరస్యానికి ప్రతీక. కావున ఇంతటి చారిత్రక నేపథ్యం ఉన్న వల్లాల గ్రామంలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Super 👏👏
అజ్ఞాత చెప్పారు…
Excellent
అజ్ఞాత చెప్పారు…
Excellent 👌