అద్వైతం!!:- గిరిధర్ రావుల-ఐపీఎస్. వనపర్తి.
అక్కడెక్కడో చెట్టు కూలింది 
ఇక్కడెందుకు చినుకు ఇగిరింది 
అక్కడెక్కడో అడివి తరిగింది 
ఇక్కడెందుకు కరువు పెరిగింది 
కాలికి గాయమైతే కళ్ళల్లో నీరు కారదా!?
మనసు ఒంటరిదైతే కళ్ళల్లో నీరు ఇంకాదా!!?

తరచి చూసే మనిషి తరిగిపోతున్నాడు. 
తరిగిపోతున్న మనిషి తడముకుంటున్నాడు. 

అక్కడెక్కడో గొంతు తెగుతుంది. 
ఇక్కడెందుకు కునుకు కరువైంది. 
అక్కడెక్కడో రుధిరం చెందింది. 
ఇక్కడెందుకో వణుకు కలిగింది. 
గాలికి కోపం వస్తే తుఫాను రేగదా!?
నీటికి పరుగులు వస్తే నేల కుంగదా!!?

తరచి చూసే మనిషి తరిగిపోతున్నాడు. 
తరిగిపోతున్న మనిషి తడుముకోకున్నాడు.

అక్కడెక్కడో పిట్టా కనుమరుగైంది 
ఇక్కడ ఎందుకు విత్తు విరిగిపోయింది. 
అక్కడెక్కడో గర్జన ఆగిపోయింది. 
ఇక్కడెందుకో ఘర్షణ పెరిగిపోయింది 
పొగ చూరితే పరిసరాల వాసన మారదా!?
వాసన రేగితే మనసులో అలజడి రేగదా!!?

తరచి చూసే మనిషి తరిగిపోతున్నాడు. 
తరిగిపోతున్న మనిషి తడుముకోకున్నాడు.

అక్కడెక్కడో మిన్ను విరిగింది 
ఇక్కడెందుకో నేల ఎండింది. 
అక్కడెక్కడో అగ్నిపర్వతం బద్దలైంది. 
ఇక్కడే ఎందుకో వరద బీభత్సం పెరిగిపోయింది. 
డప్పు చప్పుళ్ళు పాత్రలను కదిలించవా!!?
పాత్రుల పదనిసలకు మనసులు చలించవా!!?

తరచి చూసే మనిషి తరిగిపోతున్నాడు. 
తరిగిపోతున్న మనిషి తడుముకోకున్నాడు. 

అక్కడెక్కడో పొగలు చెలరేగాయి. 
ఇక్కడ ఎందుకు మేఘాలు బద్దలయ్యాయి. 
అక్కడెక్కడు నేల కనిపించింది
ఇక్కడ ఎందుకు పునాదులు కదిలిపోయాయి. 
మనసులోని భావనలే మనిషి చేతలు కావా!!?
ఉదయించే సూర్యునితో నేలవేడెక్కదా!!?

తరచి చూసే మనిషి తరిగిపోతున్నాడు. 
తరిగిపోతున్న మనిషి తడుము కోకున్నాడు.!!

గిరిధర్ రావుల .ఐపీఎస్.
వనపర్తి.

కామెంట్‌లు