మాతా శిశు ఆరోగ్య పరిరక్షణ:-సి.హెచ్.ప్రతాప్

 శిశు మరణాల రేటు ఆధారంగా ఆ దేశ ప్రజల ఆరోగ్య సంక్షేమాన్ని అంచనా వేస్తుంటారు. ఇటీవల విడుదల చేసిన రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా గణాంకాల ప్రకారం ప్రస్తుత శిశు మరణాల రేటు 28 (ప్రతి 1000 శిశు జననాల్లో 28 మరణాలు) ఉన్నట్టు తెలుస్తున్నది. గత వివరాల ప్రకారం భారత దేశ శిశు మరణాల రేటు 44 నుంచి నేడు 28కి తగ్గించడం కొంత విజయమే అయినా...ఈ సమస్య తీవ్రత దృష్ట్యా మరింత కృషి చేయాల్సి ఉంది.
    గ్రామీణ భారతంలో శిశు మరణాల రేటు (ఐ.యం.ఆర్‌) 48 నుంచి 31 వరకు, పట్టణాల్లో 29 నుంచి 19 వరకు తగ్గడం గమనించారు. భారతదేశంలో క్రమంగా శిశు మరణాల రేటు తగ్గినప్పటికీ మన ఇరుగు పొరుగు దేశాలతో పోల్చితే మనం వెనుకబడి ఉన్నామని తెలుస్తున్నది. బంగ్లాదేశ్‌, నేపాల్‌ లలో ఐయంఆర్‌ 24, భూటాన్‌లో 23, శ్రీలంకలో 6 ఉండగా... పాకిస్తాన్‌లో మాత్రం 56 వరకు ఉండడం గమనించాలి. పెద్ద దేశాలైన బ్రెజిల్‌, చైనాల కన్న భారత శిశు మరణాల రేటు ఎక్కువగా ఉందని తెలుస్తున్నది. అంతర్‌ రాష్ట్రాలు, పట్టణాలు, గ్రామాల మధ్య శిశు మరణాల రేటులో వ్యత్యాసాలు కొన్ని ప్రమాదకర వాస్తవాలను వెల్లడిస్తున్నాయి.
భారత రాష్ట్రాల్లో అత్యల్ప ఐయంఆర్‌ మిజోరాంలో 3, కేరళలో 6 నమోదైంది. చిన్న రాష్ట్రాల్లో శిశు మరణాలు తక్కువగా నమోదు కావడం గమనించారు. యం.పి (43), యు.పి (38), ఛత్తీస్‌గఢ్‌ (38), బీహార్‌ (27), జార్ఘండ్‌ (25) లో శిశు మరణాల రేటు అధికంగా ఉండడం విచారకరం. తొలి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోకుండానే ఈ శిశువులు తుది శ్వాస విడుస్తున్నారు. డబ్ల్యు.హెచ్‌.ఓ వివరాల ప్రకారం భారతీయ శిశువుల్లో పోషకాహార లోపం అధికంగా ఉండడంతో బాల్యంలో సాధారణంగా వచ్చే డయేరియా, న్యుమోనియా, మలేరియా లాంటి అనారోగ్యాలకు సైతం శిశువులు బలికావడం శోచనీయం. పోషకాహార లోపంతో వ్యాధి నిరోధక శక్తి పడిపోవడం, మరణాల రేటు పెరగడం సహజంగా జరుగుతోంది.
 2022లో ఆంధ్రప్రదేశ్‌లో 24, తెలంగాణలో 21 శిశు మరణాల రేటు ఉండడం విచారకరమే. 2021లో దేశంలో ఐయంఆర్‌ 30 ఉండగా పట్టణాల్లో 20, పల్లెల్లో 34గా నిర్థారించబడింది. తెలంగాణలో శిశు మరణాల రేటు 23 (గ్రామాల్లో 26, పట్టణాల్లో 18), ఆంధ్రప్రదేశ్‌లో 25 (గ్రామాల్లో 28, పట్టణాల్లో 19గా నమోదైంది. 2018లో ఐయంఆర్‌ దేశంలో 32, తెలంగాణలో 27, ఆంధ్రప్రదేశ్‌లో 29గా నమోదైంది.
 శిశు సంబంధ ఔషధాల కొరత, నైపుణ్యం కలిగిన వైద్య సిబ్బంది లేమి, తాగు నీరు లభించకపోవడం, పోషకాహార లోపం లాంటి సమస్యలు ప్రజారోగ్యాన్నే కాకుండా శిశు మరణాల రేటును ప్రభావితం చేస్తున్నాయి. తీవ్రమైన పోషకాహార లోపం భారతీయ బాలల్లో ప్రమాదకరంగా మారింది. ఒక మోస్తరు పోషకాహార లోపంతో బాధపడుతున్న భారత బాలలు కూడా మరణాల అంచున ఉన్నారని అర్థమవుతున్నది. భారత్‌లో తక్కువ బరువు కలిగిన శిశు జననాలు మరో తీవ్ర సమస్యగా నిలుస్తున్నది. ఆసుపత్రి ప్రసవాలు కొంత పెరిగినప్పటికి అన్ని ఆసుపత్రుల్లో సమాన వసతులు లేకపోవడం, నైపుణ్యం కలిగిన వైద్య సిబ్బంది కొరత కూడా ఐయంఆర్‌ సమస్యాగ్నికి ఆజ్యం పోస్తున్నది. తల్లుల్లో పోషకాహార సమస్య కూడా శిశువుల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నది. తాజా నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే వివరాల ప్రకారం 15-49 ఏళ్ల వయస్సుగల భారత గర్భిణుల్లో 52 శాతం మంది రక్తహీనతతో బాధ పడుతున్నట్లు తెలుస్తున్నది. దాంతో మాతాశిశు ఆరోగ్యం దెబ్బ తింటున్నది. ప్రభుత్వాలు జిడిపి లో ఒక్క శాతం మాత్రమే వైద్య ఆరోగ్యాలకు వెచ్చించడం సమస్య తీవ్రతను జఠిలం చేస్తున్నది. శిశు మరణాలు జాతికి మాయని మచ్చలని, పోషకాహార లభ్యతే సరైన ఔషధమని గుర్తిద్దాం. మాతాశిశు ఆరోగ్య పరిరక్షణ తమ ప్రథమ కర్తవ్యమని ప్రభుత్వాలు గుర్తెరగాలి.
కామెంట్‌లు