ఆమె నాకు కావాలి!!?:- డా ప్రతాప్ కౌటిళ్యా
ఆమె నాకు కావాలి 
ఉచ్వాస నిశ్వాసాల్లో గాలి మారినట్లు 
మహావృక్షాల నుంచి 
మనిషి విడిపోయినట్లు ఆమె నాకు కావాలి! 

చెట్లకు ఆకలి ఆగిపోయినట్లు 
మనిషి రక్తం రంగు మారినట్లు 
పచ్చని ప్రపంచాన్ని 
వెచ్చని రక్తం గా మార్చుకున్నట్లు 
ఆమె నాకు కావాలి!!

ఏరు దగ్గరికి వేరు పాకినట్లు 
ఊరి దగ్గరికి ఏరుపారినట్లు 
ఆమె నాకు కావాలి!!

లవణాలు -నీటిలో కరిగినట్లు 
ఆహారం- నోట్లో కరిగినట్లు 
తీరని దాహం తీరినట్లు -ఆమె నాకు కావాలి.!!?

కళ్ళల్లో కన్నీరు 
కణాల్లో నీరు ఊరినట్లు 
గుండెలు ఎగిరి పడ్డట్లు 
కండలు కదిలినట్లు ఆమె నాకు కావాలి.!!

చెట్టు- మనిషి -కలిసి నట్లు 
మట్టి- మనిషి -మాట్లాడుకున్నట్లు 
ఎండా- పండువెన్నెల -కాసినట్లు 
కాయ- పండు -అయినట్లు ఆమె నాకు కావాలి.!!

మెదడు -శరీరం- కలిసినట్లు 
జీవం- జీవ రసాయనాలు పొంగినట్లు 

తనూ తనువు- నేను ప్రణయం- ప్రాణం 
తూర్పు పడమరల్లో 
మళ్లీ మళ్లీ ప్రయాణించినట్లు ఆమె నాకు కావాలి.!!?

డా ప్రతాప్ కౌటిళ్యా 👏

కామెంట్‌లు