సుప్రభాత కవిత : -బృంద
చేతికి అందేలా  తేలుతూ
చెమ్మను ఒడిసిపట్టుకుని
చిరుజల్లుగా కురిసిపోయే
మబ్బుల్లో తేమ ఎవరికోసం?

మేఘాలకావల నిలిచి
మేదినికి గొడుగు పట్టి
భానుసంచారానికి రాదారివేసే
నీలాల నింగి ఎవరి సొంతం?

అవని అణువణువూ
ఆవరించి ప్రాణం నిలిపే
ఆధారమై అవలీలగా దొరికే
గాలి ఎవరికి సొంతం?

నీమముగా తూరుపున 
జ్యోతి కలశపు తీరున 
నభమును  వెలిగించు
బంగారు కాంతులెవరి సొంతం?

గిరులు తరులు ఝరులు 
అభరాణాలుగా ధరించి 
పంట పొలాల పట్టుకోక కట్టి 
పచ్చగా మెరిసే పృథ్వి ఎవరికి సొంతం?

జననమెక్కడో  తెలియక 
మరణమెప్పుడో  ఎరుగని 
ధరణికి అతిథులైన  నరులకు
అన్నీ తన సొంతమేనన్న అహం!

అన్నీ తెలిసినా కన్నతండ్రిలా
కాచి రక్షించు అంతర్యామి
ఆదిత్యుని ఆగమనవేళ
అరుణకాంతుల అందం అందరిసొంతం!

ఆశలు పండించు వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు