చేతిరాతతోనే పిల్లలకు ప్రత్యేక గుర్తింపు:- -అంతర్జాతీయ చేతిరాతనిపుణుడు దిడ్డి సతీష్

 అందమైన చేతిరాతతోనే పాఠశాల పిల్లలకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని, అందువల్ల పిల్లలు చక్కని చేతిరాతను నేర్చుకోవాలని అంతర్జాతీయ చేతిరాత నిపుణుడు (ఇంటర్నేషనల్ కాలిగ్రాఫర్) దిడ్డి సతీష్ అన్నారు. శుక్రవారం ఆయన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన "వారానికో వక్త" కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సతీష్ "మంచి చేతిరాతను రాయడం ఎలా"? అనే అంశంపై మాట్లాడుతూ బాల్యం నుంచి పిల్లలు చక్కటి దస్తూరిని నేర్చుకోవడం వల్ల వివిధ పరీక్షల్లో అధిక మార్కులు పొందే అవకాశముందని, ఇది ఏకాగ్రతతో అభ్యాసం చేయడం ద్వారా వస్తుందన్నారు. పాఠశాల పిల్లలు పరిశీలన, పట్టుదల, ఏకాగ్రతతో పాటు సృజనాత్మకతను పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా సతీష్ పాఠశాల పిల్లలకు చేతరాతలో మెలకువలను నేర్పించారు. ఆంగ్ల భాషాక్షరాలు, పదాలను ఎలా రాయాలో తాను రాసి చూపించారు. తర్వాత పిల్లల చేత రాయించారు. ఉత్తమంగా రాసిన ఐదుగురు విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు, గుణాత్మక విద్యతోపాటు పిల్లల మానసిక, శారీరక వికాసానికి తోడ్పడే వివిధ వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, కాలిగ్రాఫర్ దిడ్డి సతీష్, ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్, కొంకటి శ్రీవాణి, పిల్లలు, తల్లిదండ్రులు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు