ప్రేమే దైవం…ప్రేమే దారి…ప్రేమే దీపం..!:- కవిరత్న సహస్ర కవిభూషణ్ పోలయ్య, కూకట్లపల్లి -అత్తాపూర్, హైదరాబాద్
అనుభూతుల అలలపై 
ప్రయాణించే ఓ ప్రేమనౌక..!
అది ఎవరిని చూసి తిరుగదు... 
ప్రేమిస్తే సింహాసనమూ వాలిపోతుంది…
తిట్టినా...తాకట్టు పెట్టినా... 
ప్రేమ మాత్రం మారదు..!

కొందరు మన పయనాన్ని 
పొగడ్తలతో పూస్తారు...
మరికొందరు ద్వేషపు మబ్బులతో ఆవరించాలనుకుంటారు...
ద్వేషించే వారిని క్షమించాలి...
అది మన బలానికి ప్రతిబింబం..!
ఇష్టపడే వారిని ప్రేమించాలి...
అది మన గుండెకి పుణ్యఫలం..!

ద్వేషించే వారిపై...వారు 
ఊహించని రీతిలో ప్రేమవర్షాన్ని
వేగంగా కురిపించాలి...అందులో 
వారు తడిసి ముద్దైతమ 
తప్పుల్ని తాము తెలుసుకోవాలి..!

ఒక దయాసముద్రున్ని...
చాటుమాటుగా కాటువేసినవారికి...
ఒక ప్రేమమూర్తిని...చిత్రహింసలకు 
గురిచేసి మంటల్లో మసిచేసినవారికి...
మానని గాయాల మౌనశబ్దంతో
సజీవదహనానికి బలిచేసినవారికి...
క్షమాగుణంతోనే...గుణపాఠాలు నేర్పాలి 
మానవత్వమే మంత్రంగా మమతను... సమతను...మానవతను...చాటాలి

ఓ మానవతావాదీ...
మానవత్వం మరిచి 
అతి దారుణానికి ఒడిగట్టిన
మా ఈ మానవమృగాళ్లను మన్నించు..!
అంటూ కన్నీటితో వేడుకోవాలి...

ప్రేమ అనేది శస్త్రం కాదు...శక్తి..!
ఇది హింస కాదు దివ్యఔషధం..!
దారి తప్పినవారికి చీకటిలో చిరుదీపం…
సుబుద్ధిని కలుగజేసే దైవతత్వం..!

ప్రేమతోనే కరుణ పుష్పిస్తుంది...ఆ
కరుణలోంచే క్షమాగుణం వెల్లివిరుస్తుంది...
ఆ క్షమలోనే దైవత్వం ప్రతిధ్వనిస్తుంది..!

ప్రతి రోజు...
ఏకాగ్రతతో మౌనంగా 
పరమాత్మతో సంభాషిస్తూ…
కుల మత కుమ్ములాటలు 
జాతి వర్గ వర్ణ విభేదాలు లేక 
శాంతి, సహనం, సమానత్వం...
ప్రేమ దయ, కరుణ జాలి ఉలులుగా
శిలగా మారిన ఈ మట్టిమనిషిని...
సుందర శిల్పంలా చెక్కాలి....
శివరూపంగా...తీర్చిదిద్దాలి...
ఆత్మతో ఆరాధించాలి...
ప్రశాంతంగా జీవించాలి... 



కామెంట్‌లు