కవితా శీర్షిక:-కరోనా కష్టాలు కవితా రచన:-లిఖిత్ కుమార్ గోదా. "నాన్నా! నేను కరోనాపై ఓ కవిత రాశా! వింటావా" అని అడిగా సోఫా మీద కూర్చుని దర్జాగా టీవీ సంద్రంలో మునిగిపోయిన నాన్నని "ఇప్పుడు తీరిక లేదు పో" అని గంభీరంగా అన్న నాన్న మాటలు వినబడడంతో వెనుదిరిగి పది పరీక్షలు రిజల్ట్ కోసం వేచి ఉన్న విద్యార్థులా కూర్చుని లూడో ఆడుతున్న అమ్మ దగ్గరికి వెళ్లి "అమ్మా!'కరోనా కవిత' రాసా వింటావా"అని పనసతొనలు పెట్టి అడిగినట్టు అడిగా, పెద్ద బిజినెస్ వ్యవహారం నడుపుతున్నట్లు "ఆగు నాని! మంచి రసవత్తరంగా ఆట కొనసాగుతుంది. సాయంత్రం వింటా వెళ్ళు" అని నాకే తిరిగి పనసతొనలు పెట్టింది. చక్కగా మంచం మీద కూర్చుని వాట్సాప్ లో నిమగ్నమైన అక్కని అడిగా "కాంట్ టాక్, వాట్సప్ ఓన్లీ" అని అనడంతో ఇక వెనుదిరిగి గుడ్లప్పగించి, కళ్లార్పకుండా "పబ్జి"ఆడుతున్న తమ్ముడుని అడిగా "నన్ను డిస్టర్బ్ చేయొద్దు అన్నయ్య, చికెన్ డిన్నర్ చేయాలి" అంటూ ముందుకు తోసేసాడు. సరే బయటకూర్చున్న తాతయ్య నడిగితే తేనీరు తాగుతూ తాతయ్య "యూట్యూబ్"లో మహాభారతాన్ని ఏదో టెస్ట్ మ్యాచ్ చూసినట్టు చూస్తూ 'ఇప్పుడు తీరికలేదు మనవడా' అంటూ కళ్ళజోడు సరిచేసుకున్నాడు. నానమ్మ దగ్గరికి వెళితే నానమ్మ కూడా అదే యూట్యూబ్లో పంచాంగాన్ని పరీక్షిస్తూ "నాకు ఇప్పుడు గ్రహాలు అనుకూలంగా లేవు వెళ్ళు మనవడా" అని సాగనంపింది. పక్కింటి అక్కని, ఎదురింటి అన్నయ్యని అడిగితే "టిక్ టాక్ చేసుకోవాలి.. డోంట్ టాక్" అని నన్ను పంపేశారు. సర్లే చివరాకరకు వెనుకింటి ఫ్రెండ్స్ ని అడిగితే "మామా నేను పబ్జి, ఫ్రీ ఫైర్ ఆడుతున్న నీకు రిక్వెస్ట్ పంపిస్తా, నాతో కలిసి ఆడతావా"అని ఒకడు, "బాబాయ్! ఇంస్టాగ్రామ్ లో మంచి ఫోటో ఒకటి పెట్టా చూసి ఒక లైక్ ఇచ్చుకో" అని ఇంకొకడు మతి పోగొట్టారు. ఇక లాభం లేదు లే అని మొబైల్ ఆన్ చేసి ఈ కరోనా కవితని "ఫేస్బుక్లో" పెట్టేసా.


కామెంట్‌లు