సాగర్ కబుర్లు *(మా..అక్క)----డా.కె .ఎల్.వి.ప్రసాద్ -- హనంకొండ .-9866252002-8886991785

సాగర్ ..అనబడే ,నాగార్జున సాగర్ లో నేను చదివింది ,ఇంటెర్మీడియేట్ రెండు సంవత్సరాలు .
అంటే పందొమ్మిదివందల డబ్బయి రెండు ...డబ్భై నాలుగు అన్నమాట !కానీ ...అంతకుముందు అప్పుడప్పుడు సాగర్ వెలు 
తుండేవాడిని .కారణం ,మా పెద్దక్క కుమారి కానేటి మహానీయమ్మ ,సైన్స్ టీచరుగా ,దక్షిణ విజయపురిలో ,హైస్కూలు లో పనిచేసేది .అందుచేత ,హైదరాబాద్ వైపునుంచి వస్తే ,బస్సులో వయా మల్లేపల్లి వెళ్ళేవాళ్ళం .విజయవాడ వైపునుండి వస్తే ,గుంటూరు _మాచర్ల 
పాసెంజర్ లో వెళ్లేవాళ్లం.ఉన్నది అదొక్కటే రైలు పయిగా మీటర్ గేజ్ !ఎంతకీ ఓ ..పట్టాన మాచర్ల వచ్చేదికాదు.రైలు మాచర్ల లో దిగేసరికి ,వళ్ళు హూనం అయిపోయేది.మళ్లీ అక్కడ బస్సుపట్టుకుని రైట్ బాంక్ ప్రయాణం.బస్సు దిగగానే స్వర్గంలో అడుగుపెట్టిన ఫీలింగ్ ఉండేది.ఇంట్లో వచ్చి పడి ...పోయామన్నంత ఆనందం !నేను సాగర్ చూసేసరికి ,డామ్ కట్టడం పూర్తి కాలేదు గ్యాలరీ లో నుంచి పైలాన్ కు వెల్లవలసి వచ్చేది .అదో భయంతో కూడిన సరదా !నాకు ఎవరోవకరు తోడువుండేవారు .అందులో రాంగోపాల్ ,నరసింగరావు ,నారాయణ రావు గారలు,ముఖ్యులు.అక్కయ్య ,విజయపురి సౌత్ హైస్కూలు లో పని చేస్తున్నప్పుడు ,శివశంకరం గారు హెడ్మాష్టరు గా 
పనిచేసేవారు .శర్మ గారు ,హరనాథ్ బాబా గారు ,పీటర్ పాల్ గారు ,నాగభూషణం గారు ,సత్యవతి గారు ,సుబ్బారావు గారు ,రాఘవయ్య గారూ ,శేషారత్నం గారు ,తెలుఁగు మాష్టారు ,డ్రిల్లు మాష్టారు (వీరి పేర్లు గుర్తు లేవు ) ఇంకొక మాథ్స్ మాష్టారు ఉండేవారు .మిగతా ఎవరూ గుర్తు లేరు .అక్క ..ఉదయం ఎదైనా టిఫిన్ చేసి ,మధ్యాహ్నం ఇంటికి వచ్చి లంచ్ చేసి వెళ్ళేది .సాయంత్రం ఉచిత ట్యూషన్ కు పిల్లలు వచ్చేవారు .వాళ్ళువెళ్లిపోయేవరకు వంట ప్రయత్నాలు వుండేవికాదు.ఒకోసారి ఆకలి అయిపొయి పిచ్చిలేచిపోయేది .అసలే నాకు ఆకలి 
ఎక్కువమరి !అసలు కొసమెరుపు ఆదివారం **అక్క నూరుశాతం శాఖాహారి కనుక ,అందులోనే ప్రత్యేకమయిన వంటలు చేసేదీ .రుచికరంగా ఉండేవి అక్క వంటలు .ఇక సాయంత్రం ఐదుగంటల ప్రాంతంలో అమ్మలక్కలు ఇంటికి వచ్చేవారు .బడికి దగ్గరలో 
ఏ _౫౫,(యాభైయైదు )క్వార్టర్ లో ఉండేది.దగ్గరలొ పరిచయం ఉన్న గృహిణులందరూ అక్కడకి చేరుకునేవారు.రకరకాల ముచ్చట్లతో నడుస్తుండేది సమావేశం.రాత్రి ,ఏడు _ఎనిమిది  అయిపోతుండేది.వీళ్లు ఓపట్టానా కదిలేవారు కాదు .నాకు ఆకలి అయి 
కడుపులో మెలిపెట్టేది.అడిగితే ..అక్క కోప్పడుతుందని భయం !ఇక ఇలా లాభం లేదనుకుని ,దొడ్డివైపు జామచెట్టుకు ఒక ఇనుప పలక వేలాడదీసి ,'బెల్ ' కొట్టినట్టు కొట్టేవాడిని .అంతే అది విని ,"అమ్మొ ..ప్రసాద్ బెల్ కొట్టేసాడు " అని నవ్వుకుంటూ లేచి వెళ్ళిపోయేవారు .అప్పుడు వంట చేసి పెట్టేది అక్క..మేము ఇంట్లో లేనపుడు వంటచేసుకోకుండానే పడుకునేదట అక్క ప్రేమ ,అభిమానం ,క్రమశిక్షణ ,ఆ ..జ్ఞాపకాలు నా ..ప్రతి కదలికలోనూ గుర్తుకు వస్తాయ్ .ఒక్కోసారి ఆలోచిస్తే ..కన్నీళ్లు జల ..జల ..కారిపోతుంటాయ్ !ప్రేమమయి ..త్యాగమయి .మా ..అక్క స్వర్గీయ కానేటి మహానీయమ్మ !!



కామెంట్‌లు