మామిడి పళ్ళ మహిమ ----డా.కె .ఎల్.వి .ప్రసాద్, హనంకొండ,వరంగల్.

చిన్నతనంలో చిలిపి పనులు అనేక రూపాల్లో ఉంటాయి. అప్పుడు అవి చిలిపి పనులు అని ,అవి తప్పుడు పనులని ,పిల్లలు అలాంటి పనులు చేస్తే పెద్దలకు చెడ్డపేరు వస్తుందని కూడా తెలియని లేత వయసు అది. ఎన్నో .. ఎన్నెన్నో .. కోర్కెలు వున్నా ,వాటిని పెద్దవాళ్ళు తీర్చలేరని తెలిసినా ,వాటికోసం ,ఆరాటపడడం ,పిల్ల చేష్టలు అనడానికి నిదర్శనం. 
 మా .. ఇల్లు గోదావరి వైపు ఉండేది . ఇంటికి అతి దగ్గరలోనే ఎత్తైన ఏటిగట్టు ,దానిపక్కనే పల్లపు ప్రదేశం ,పంటకాల్వ ప్ర వహిస్తూ ఉండేది. దానిపక్కనేకంకర రోడ్డు.ఆరోడ్డు గుండానే ఎద్దుల బళ్ళు,గుర్రపు బళ్ళు,అప్పుడప్పుడు కార్లుట్రాక్టర్లు,నడుస్తుండేవి.గుర్రపుబండిలో
సినీమా ప్రచారం జరిగేది.మంచి సినీమా పాటలు వేస్తూ కరపత్రాలు గాలిలో విసిరేవారు.అవి అందుకోవడానికి ఆ గుర్రపు బండి వెనుక పరిగెత్తేవాళ్ళం!ఇకఅసలు విషయానికొస్తే ఆ రోడ్డు పక్క పెద్ద కొబ్బరి తోట,అందులో మామిడి చెట్లు ఉండేవి.రోడ్డును వేరు చేస్తూ ముళ్ల కంచె (దడి)ఉండేది.ఆ తోట యజమాని మా వూరికి దగ్గరలోని ‘ చింతల పల్లి’ అనే ఊరిలోఉండేవారు.యజమాని అసలు పేరు తెలీదు కానీ ఆవిడను,చిలకమ్మఅనీ,ఆ..తోటను’ చిలకమ్మ గారి తోట’,అనేవారు.దడి కి దగ్గరలో పెద్దమామిడి చెట్టు ఉండేది.తియ్యటి రసాల మామిడి చెట్టు.వేసవిలో నిండుగామామిడి కాయలు కాసేది.మా ఇంటి ముందు ఏటిగట్టు మీద నిలబడిచూస్తే,చెట్టూ-చెట్టునిండా కాయలు కనిపించేవి.మనసంతా,వాటిని తినా--లనే కోరికతో నిండిపోయేది.ఆ తోటకు కాపలా కాయడానికి ఒక లోకల్   వ్యక్తిని నియమించు కునేవారు.ఆయన చెట్టు దరికి చేరనిచ్చేవాడు కాదు.ఇంట్లో అడిగే దైర్యం లేదు .కొనుక్కుని తినే వెసులుబాటు లేదు.ఆ..తియ్య
ని,మామిడి పండు తినాలనే కోరికను చంపుకోలేని పరిస్థితి.ఒక ఉపాయం ఆలోచించి తెల్లవారుతున్న సమయంలో ముళ్లకంచెకు
కొద్దిగా,అటూ-ఇటూ జరిపి,మార్గం చేసుకుని,ముల్లుగుచ్చుకున్నాలెక్క-చేయక,లోపలికి దూరేవాడిని,5-6,మామిడిపళ్ళు చెట్టుకింద పడివుండేవి.వాటిని తస్కరించి మళ్ళీ జాగ్రత్తగా దడి దాటి బయటి కి,అతి కష్టం మీద వచ్చేవాడిని.ఇంట్లో తెలీకుండా చాటుగా తినేసేవాడిని.కొసమెరుపు ఏమి-టంటే ,నాకు పోటీగా,మా ఇంట్లో మా చిన్నక్క ఉండేది.ఎక్కువ సార్లు గెలుపు నన్నేవరించేది .ఆ మామిడి పళ్ళ రుచి ఎప్పటికీ మరచిపోలేను.ఇప్పుడు తింటున్నమామిడి పళ్లల్లో,ఆ..రుచి దొరకడం లేదు…ఆశ్చర్యం కదూ…!!


                                 


కామెంట్‌లు