మనం "మహా భాగవతము" అనగానే పోతన మహాకవిని గుర్తుకు తెచ్చుకుంటాం. కానీ ప్రస్తుతం మనకు లభిస్తున్న భాగవతము కేవలం పోతన రాసింది మాత్రమే కాదు. పోతన రాసిన భాగవతంలో 12 స్కంధములున్నాయి కదా! అందులో కొంత భాగము శిధిలమై పోవుటచే,ఆ శిధిల భాగములను ఇతర కవులు పూరించ వలసి వచ్చింది. దాని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.అసంపూర్ణంగా ఉన్న ఆనాటి భాగవతమును, పూరించిన, వారిలో ఏర్చూరి సింగన షష్టమ(ఆరవ ‌‌) స్కంధము, గంగన్న పంచమ( ఐదవ) స్కంధము, వెలిగందల నారయ ఏకాదశ( పదకొండవ) ద్వాదశ (పన్నెండవ)స్కంధములను రచించినట్లు తెలుస్తుంది. తృతీయ చతుర్ధ దశమ స్కంధం (మూడవ,నాలుగవ, పదవ) ఉత్తర భాగములలో కూడా అచ్చటచ్చట నారయ రచనయున్నదని చెప్పుదురు. మహా భాగవతం లలిత రసాల పదములతో మృదుమధురంగా ఆహ్లాదకర సంగీతము ఇమిడియున్నట్లే అనిపిస్తుంది.. ఇంపు సొంపైన కథలు, నీతులు, పిన్నలు పెద్దలు,అందరూ మెచ్చే మహాకావ్యము భాగవతం. నారాయాది కవులు తమ రచనలతో పోతననే అనుకరింప ప్రయత్నించారు,కానీ కృతకృత్యులు కాలేకపోయారు. వీరి ముగ్గురిలో సింగన మిగిలిన ఇద్దరి కంటే కొంత సమర్థుడుగా కనిపిస్తాడు. శ్రీమదాంధ్ర భాగవతాన్ని పోతన సంపూర్ణముగా వ్రాసినప్పటికీ, కాలాంతరమున ఏల్చూరి సింగన, గంగన్ర మరియు వెలిగందల నారయ, అను ముగ్గురు కవులు భాగవత శిథిల భాగాలను పూర్తి చేయ వలసి వచ్చింది.జక్కన్న మహాకవి:-ఈ మహాకవి విక్రమార్క చరితమను కావ్యం వ్రాశాడు. ఈ కావ్యాన్ని దేవరాయల కడ గణకుడిగా ఉంటున్న సిద్ధనామాత్యునకు అంకితం చేశాడు. జక్కన మంచి పండితుడే కాక అవధాన నిర్వహణము నందు ప్రజ్ఞ కలవాడు. ఈ కావ్యమునందు విక్రమార్క చక్రవర్తి చేసిన అద్భుత సాహసకృత్యాలు వర్ణింపబడినవి. ఈ కావ్యం ఆబాలగోపాలం చదువదగిన పుస్తకము.ఇదే పుస్తకం మనకు "భట్టి విక్రమార్క కథలు"గా నేటికీ లభించుచున్నది. ఈ రోజుకి కూడా బజారులో " భట్టి విక్రమార్క కథలు" పుస్తకం చౌకగా లభిస్తున్నదంటే, పుస్తక రచనా కౌశలం అర్థమవుతుంది. ఇది సరళమైన భాషలో వీర రసాత్మక కథలతో పాటు విక్రమార్క సాహసకృత్యాలు మన కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. దీనిని జక్కన్న మహాకవి ఆనాడు రాసినప్పటికీ ఈనాటికి అనేకమంది తెలుగు రచయితలు మరల మరల వ్రాస్తూనే ఉన్నారు. అదే ఈ పుస్తకం ఒక ప్రత్యేకత.విక్రమార్క చక్రవర్తి ధైర్యసాహసాలకు ప్రతీక. అందుకే మనకు విక్రమార్కుడు శక పురుషుడి గా నిలిచాడు. మనకు ఉత్తరాది క్యాలెండర్లలో "విక్రమార్క శకం" అనే నేటికీ సంవత్సరాలు గణిస్తారు.ఇప్పుడు "భట్టి విక్రమార్క కథలు" బాలలచే చదివించడం తల్లిదండ్రుల బాధ్యత.అనంతామాత్య మహాకవి:-కవి అనంతామాత్యుడు "భోజరాజీయము" అను ప్రసిద్ధ గ్రంధాన్ని రచించాడు. ఇది తెలుగులో గొప్ప గ్రంథం.ఈ గ్రంథము క్రీ.శ 1434 నాటిదని తెలియుచున్నది. ఈ కవి గురు దేవత భక్తి తత్పరుడు. ఈయన తను రాసిన గ్రంథాన్ని అహోబల దేవునికి అంకితం ఇచ్చాడు. భోజరాజీయములో కధలు కూడా వీర శూర సాహస రసాత్మకంగా ఆలోచింప జేసే విధంగా కనిపిస్తాయి. పాఠకులను చదవాలనే ఉత్సాహం కలిగిస్తాయి. కాలానుగుణ మార్పులతో "సాలభంజికా కథలు" మరియు " బొమ్మలు చెప్పిన కమ్మని కథలు,"అనే పేర్లతో లభించిన పుస్తకాలు కూడా ఈయన రాసినవేని అంటారు. .బాలలకు ఆనందం కలిగించే కథలు ఇవి. పఠనా శక్తిని కూడా పెంపొందిస్తాయి. ఈ కథలు భట్టి విక్రమార్క కథలతో సరితూగ గలవు.మన ఆంధ్రదేశమున నేటికిని సుప్రసిద్ధ సత్య ప్రభావమును నిరూపించు గోవ్యాఘ్ర సంవాదం (ఆవు ‌పులి) అను కథ ఈ మహాకవి రాసినదే. ఈ కథలో సత్యమునకు గల ప్రాధాన్యతను తెలియజేయడం జరిగింది.కథలో ఆవు- పులి; దూడ సంభాషణలు నాటకీకరణతో పాటు మనస్సుకు హత్తుకు పోయే విధంగా ఉంటుంది. "సత్యమే జయం" అనే సూక్తిని నిరూపించే చక్కని కథ ఇది.భోజరాజీయములో ఉన్న కథలన్నీ నీతి ప్రధానమైనవే. ఈ కవి శైలి ద్రాక్ష పాకము వలె మిక్కిలి మృదుమధురంగా ఉంటుంది. అక్కడక్కడ గృహ జీవితమును స్త్రీల సంభాషణలను చక్కగా వర్ణించాడు. ఆవు పులి (కథ) సంవాదము; కవి అనంతామాత్యుని కీర్తికి ప్రతీక.(విక్రమార్క కథలు, భోజరాజీయ కథలు బాలలచే తప్పక చదివిందగినవి, సత్యము జయించును అని నిరూపించు 'ఆవు-పులి' కథను పిల్లలకు తప్పక చెప్పవలసిన బాధ్యత కూడ మన అందరిపై ఉంది). -బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబర్:-929006136


కామెంట్‌లు