విచిత్ర వేషాలు : డా. కె. ఎల్. వి. ప్రసాద్ , హనంకొండ,వరంగల్.

హై స్కూల్ జీవితం రాజోలులో (తూ. గో. జి)పాక్షికం గానే జరిగింది. అంటే 
కేవలం మూడు సంవత్సరాలు . ఆరు ,ఏడు ,ఎనిమిది ,తరగతులు అన్న-
మాట !ఆ .. మూడు  సంవత్సరాలూ గొప్పవీ ,గుర్తుంచుకోదగ్గవీనూ.అంటే 
హాస్టల్ లోవుండి చదూకోవడం అన్నమాట !సోమవారం నుండి శనివారం 
మధ్యాహ్నం వరకూ హాస్టల్ . శనివారం ఒంటిపూట బడివుండేది. అందు-
చేత,సాయంత్రానికల్లా ఇంటికి చేరుకునేవాళ్ళం కాలినడకన. మళ్ళీ సోమ-
వారం బయలుదేరి సరాసరి హాస్టల్ కు వెళ్లి ,అక్కడినుండి బడికి వెళ్లే వాళ్ళం . 
హాస్టల్ లో చాలా మంది దిగువ మధ్య తరగతి పిల్లలే ఉండేది. కొంతమంది 
దగ్గర మాత్రమే డబ్బులు ఉండేవి . ఎక్కువశాతం పిల్లల దగ్గర చిల్లిగవ్వ కూడా ఉండేది కాదు . డబ్బులున్న పిల్లలు ఏవైనా చిరు తిండ్లు కొనుక్కు
ని ,తింటుంటే మిగతావాళ్ళు వాళ్ళ వంక చూస్తూ ఉండేవారు. ఆ ..బృందం 
లో నేనూ ఉండేవాడిని. ఒకోసారి పేదరికానికి ఏడుపు కూడా వచ్చేది. చాలా మంది పిల్లలు ఇతర విషయాల మీద దృష్టి పెట్టకుండా కేవలం 
చదువుకే ప్రాధాన్యత నిచ్చేవారు. 
ప్రతి అంశంలోనూ మంచి -చెడు ,అనేవి ఎప్పుడూ ఉంటాయి. అలాగే 
మంచి పిల్లలతో పాటు అల్లరి పిల్లలుకూడా ఉండేవారు. వీరు చదువు 
మీద అంతగా శ్రద్ధ చూపించేవారు కాదు ,పైగా బాగా చదువుకునేవాళ్ళకి 
ఇబందులు సృష్టించేవారు. అంతమాత్రమే కాకుండా దాదాగిరి చలాయించే
వారు. వాళ్ళ అల్లరి హాస్టల్ మేనేజర్ దృష్టికి వెళ్లనిచ్చేవారు కాదు. మేము 
రాత్రి భోజనం చేసిన తర్వాత ,9 గంటల వరకూ చదూకునె వాళ్ళం. పవర్ 
మెయిన్ ఆపేసేవాళ్ళు. పంకాలు (ఫ్యాన్ )ఉండేవి కాదు . అల్లరి బ్యాచ్ 
రెండో ఆట సినిమాకు వెళ్ళేవాళ్ళు . వాళ్ళు సినీమా చూసి తిరిగి వచ్చేసరి
కి ,మేము మంచి ఘాడ నిద్రలో ఉండేవాళ్ళం . అది గమనించి ఆ .. అల్లరి 
మూక ,మా మొలతాళ్లు కత్తిరించేవారు. ఎందుకు అలా చేసే వారో ఇప్పటి
కీ ,అర్ధం కాదు . మళ్ళీ ఇంటికి వెళితే తప్ప మొలతాడు కొనుక్కునే డబ్బులు ఉండేవి కాదు. ఇంకొందరు ,దీపం కిటికీ లో పెట్టి ,గోడమీద --
తయారైన మసి గీకి కొబ్బరి నూనెలో కలిపి ,నిద్రపోతున్న వాళ్ళ మూతు
లకి మీసాలు వేయడం ,వికృతమైన బొమ్మలు వేయడం చేసేవారు. ఉదయం లేచిన తర్వాత అందరూ చూచి నవ్వుతుంటే తప్ప అసలు ఏమి 
జరిగిందీ తెలిసేది కాదు. సబ్బు ఉండేది కాదు కాబట్టి ,ఎంతకడిగినా ఆ .. 
మసి ,ఓ పట్టాన పోయేది కాదు . అదొక పెద్ద సమస్యగా ఉండేది కాదు. 
ఎవరినీ అడిగే దైర్యం ఉండేది కాదు. నిశ్శబ్దంగా రోదించేవాళ్ళం అంతే .. !
                          ఇంకొంత మంది వేరే భిన్నమైన పని చేసేవారు. 
శీతాకాలం బాగా చలి పెట్టేది. కప్పుకోవడానికి కొంతమందికి దుప్పట్లు 
ఉండేవి కాదు. అందుకని దుప్పటి కప్పుకుని ఘాడ నిద్రలో ఉన్నవాళ్ళని 
గుర్తించి జాగ్రత్తగా ఆ .. దుప్పటి తీసుకుపోయి హాయిగా కప్పుకుని పడు-
కొనేవారు . మధ్యలో మెలుకవ వచ్చి చూస్తే మీద దుప్పటి ఉండేది కాదు. 
ఇక చూడండి పరిస్థితి ఎలా ఉంటుందో !
ఇలాంటివి ఎన్నెన్నో బాల్యపు అనుభవాలు తవ్వేకొద్దీ బయట పడుతుం-
టాయి . అయితే అప్పటి అల్లరి తో ముడిపడి వున్నపిల్లలు చదువులు 
అనుకున్నంతగా సాగలేదు. జీవితంలో స్థిరత్వం కూడా వాళ్లకి ఏర్పడ--
లేదు. అప్పుడు నా లాంటి వాళ్లు కష్టపడినా ,తర్వాత చక్కగా జీవితంలో 
స్థిరపడడానికి మెండుగా అవకాశాలు దక్కాయి. అందుకు నేనే మొదటి 
ఉదాహరణ అవుతానేమో !ఎందుచేతనంటే ,నా బాల్యం అంతాఇబ్బందుల  
మయమే మరి !మంచి,ఆనందమయ  జీవితానికి క్రమశిక్షణే ముఖ్యమైన 
అంశంగా గమనించక తప్పదు .


కామెంట్‌లు