ఆ దెబ్బ భవిష్యత్తుకు హెచ్చరిక : - డా. కె. ఎల్. వి. ప్రసాద్ - హనంకొండ.

అవి నేను మా తాలూకా ప్రధాన కేంద్రం ‘రాజోలు ‘(తూర్పు గోదావరజిల్లా)
హైస్కూల్ లో చదువుతున్న రోజులు. ఆరవ తరగతి నుండి ఎనిమిదవ -
తరగతి వరకూ కోర్టు సముదాయానికి దగ్గరలో వున్న పాఠశాలలోక్లాసు--
లు ,జరిగేవి. తొమ్మిదవ తరగతి నుండి ఎస్. ఎస్. ఎల్. సి.,వరకూ 
రాజోలు చివర సావరం రోడ్డులో వున్న పాఠశాలలో క్లాసులు జరిగేవి. 
నేను ‘ఇన్ -టు -ఫస్ట్ ఫారం ప్రవేశ పరీక్ష రాసి ,చిన్న బడిలో అంటే --
ఆరవ తరగతిలో ప్రవేశం పొందాను . 
నేనూ -నాతోపాటు కొంతమంది రెండవ  తెలుగు బదులు ,సంస్కృతం 
పాఠ్యఅంశంగా ఎన్నుకోవడం వల్ల మా కొద్దీ మందిని ఆడవాళ్ళ సెక్షన్ లో 
వేశారు. ఓ పదిమంది మగపిల్లలు,మిగతావాళ్లంతా ఆడపిల్లలు ఉండేవారు
ఇది మగ పిల్లలకు ముఖ్యంగా ఏవరేజ్ పిల్లలకు చాలా ఇబ్బందిగాఉండేది. 
ఉపాధ్యాయులు అడిగిన దానికి సరైన సమాధానం చెప్పలేకపోతేఅందరు 
పక .. పక .. నవ్వేసేవారు . అది మగపిల్లలకు అవమానకరం అనిపించేది
       అలాంటి అనుభవం నాకు ఒకటి జరిగింది. ఇలాంటి అనుభవాలు 
బాల్యంలో చాలా మందికి ఎదురుకావచ్చు. అయితే అందరూ ఇలాంటి 
వాటికి పెద్దగా ప్రాధాన్యత నివ్వరు . అప్పటికప్పుడే మర్చిపోతారు,కానీ 
కొంతమంది సున్నిత హృదయులు ఇలాంటి అనుభవాలు మర్చిపోలేరు . 
జీవితాంతం తలచుకుంటారు,గుర్తు పెట్టుకుంటారు . ఈ రెండవ కేటగిరి కి 
చెందిన వాడిని నేను. 
మా బడిలో చదువుతోపాటు,డ్రాయింగ్ ,డిబేటింగ్ ,డ్రిల్లు ,చేతిపని ,వంటి 
వాటికి కూడా ప్రాధాన్యత నిచ్చేవారు. లైబ్రరీ క్లాసుకూడా ఉండేది. ఎక్కడైనా క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యత ఉండేది. ఈ నేపథ్యంలో వారం 
లో ఒకరోజు డ్రాయింగ్ కు కేటాయించేవారు. మా డ్రాయింగ్ మాష్టారు ను 
చూస్తే ,ఉపాధ్యాయుడి వస్త్రధారణ ఇలా ఉండాలి సుమా !అనిపించేట్టుగా 
ఉండేది. ఖద్దరు పంచ ,ఖద్దరు పొట్టి చేతుల చొక్కా ,భుజం మీద కండువా
చేతిలో అతి సాధారణ నార సంచి ,పక్కా గాంధీయ వాది లా (నిజంకూడా)
ఉండేవారు. సైన్యంలో పనిచేసి వచ్చిన వ్యక్తి. జిల్లాలో మొదటి విధవ --
వివాహం ఆయనే చేసుకున్నారట !
నాకు కొన్ని టెస్ట్ బుక్కులు,ఒక నోట్ బుక్ మాత్రం ఉండేది. మాస్టారిభయా 
నికి ,డ్రాయింగ్ పుస్తకమూ ,పెన్సిలూ ,అతి కష్టం మీద కొనుక్కున్నాను.
డ్రాయింగ్ మాస్టారి మొదటి క్లాసు లో ఏమేమి తెచ్చుకోవాలో చెప్పారు. 
తర్వాతి క్లాసులో ,మాష్టారు బోర్డుమీద బొమ్మ వేసి అది మమ్మల్ని డ్రాయింగ్ బుక్ లో గీయ మన్నారు. 
అందరం బొమ్మలు గీస్తున్నాం,అందరి బొమ్మలూ పరిశీలిస్తూ వస్తున్నారు
నా దగ్గరి కొచ్చి ఆగిపోయారు. నాబొమ్మను సరిచేసి అవసరం లేని గీతలు 
రబ్బరు (ఇరేజరు )తో చెరిపేయమన్నారు. నాలో కదలికలు లేకపోవడం 
గమనించి ‘’ర బ్బరు తేలేదా ?’’ అన్నారు. 
‘’ లేదు సర్ ‘’అన్నాను .
ఆయనకు చాలా కోపం వచ్చింది (నా .. పేదరికం ఆయనకు తెలీదు మరి)
వెంటనే బెంచ్ ఎక్కమన్నారు. బెంచ్ ఎక్కినతర్వాత ,చెంప మీద ఒక్క దెబ్బ చెళ్లు మనిపించారు. ఆయన కొట్టిన దెబ్బ తాలూకు బాధ కంటే ,ఆడపిల్లల మధ్య అవమానం భరించలేక పోయాను. అంతే మళ్ళీ ఎప్పుడూ డ్రాయింగ్ క్లాసుకు రబ్బరు మరచిపోలేదు !ఆ.. దెబ్బను నా మంచి భవిష్యత్తుకు ఒక హెచ్చరిక గానే భావించాను తప్ప ,అప్పుడూ 
ఎప్పుడూ బాధ పడలేదు ,మా డ్రాయింగ్ మాస్టారు శ్రీ హనుమంత రావు 
గారిని తలచుకుంటూనే ఉన్నాను. నాటి గురువులు గొప్ప మార్గ దర్శకులు మరి !!


                 


కామెంట్‌లు