అప్పటి .. దీపావళి ..- డా. కె. ఎల్. వి. ప్రసాద్ ,హనంకొండ ,వరంగల్ .

నాకు వూహ వచ్చేసరికి మా ఊరి లో (దిండి గ్రామం )అసలు పండగ వాతావరణం ఉండేది కాదు. ఒక సంక్రాంతికి మాత్రం కాస్త హడావిడి
కనిపించేది. క్రిస్మస్ టైం కు మాత్రం పక్క గ్రామంలో వాళ్ళు ,ఎప్పుడో
తెల్లవారకముందే వచ్చి వీది గుమ్మానికి ‘క్రీస్తు నేడు పుట్టెను . హల్లెలూయా ‘అన్న స్లిప్పు అతికించి పోయేవారు . మన సంస్కృతీ-
సంప్రదాయాల ప్రకారం పండుగలకు మంచి ప్రాధాన్యత వుంది. కానీ ,
మా గ్రామంలో ఆవాతావరణం ఏమాత్రం లేకపోవడానికి కారణం వేరే
వుంది . మా గ్రామం ఉద్యమాల గడ్డ. అంతా కమ్యూనిస్ట్ వాతావరణం
ఉండేది.దేవుళ్ళు ,గుడులు -గోపురాల ప్రస్తావన అసలు ఉండేది కాదు.
అందుచేత పండుగల ప్రస్తావన ఉండేది కాదు.
మా గ్రామంలో షుమారుగా తొంబై శాతం దళితుల కుటుంబాలే !అన్నీ పేద కుటుంబాలే . పదిశాతం మాత్రం క్షత్రియ కుటుంబాలు ఉండేవి.
వాళ్ళే నూరు శాతం భూస్వాములు. పంటపొలాలు ,కొబ్బరి తోటలూ
అన్నీ వాళ్ళవే ! పండుగలు -పండుగ వాతావరణం ఆ .. ఇళ్లలోనే ఉండేది.
మా కుటుంబాలన్నీ ,ఆ .. ఇళ్లల్లోని వెలుగులు ,చూసి ఆనందించేవి.
ఇక వాళ్ళ ఇళ్లల్లో టపాకాయల శబ్దాలకు ,చిచ్చిబుడ్లు -మతాబాల తళు-
క్కలు ,దూరంనుండే చూసి ఆనందించేవాళ్ళం. నాకు మాత్రం టపాకాయలు కాల్చాలని అనిపించేది. మా దూరపు బంధువు కారుపెల్లి
భీమారావు ,స్వంతంగా చిచ్చుబుడ్లు ,మతాబాలు ,సిసింద్రీలు తయారు చేస్తుంటే దగ్గరికి వెళ్లి చూసేవాళ్ళం. ఆయన కొన్ని సిసింద్రీలు ఇచ్చేవాడు.
వాటిని చాలా జాగ్రత్తగా కాల్చుకునేవాళ్ళం. తర్వాత స్వంతంగా ఖర్చులేని
పధార్ధాలతో ‘చిటికెల పొట్లం ‘ తయారు చేసుకునేవాళ్లం. దానితో తృప్తి
పడేవాళ్ళం. కాస్త పెద్దయ్యాక ,చీకటి పడేసరికి ,మా పెద్దన్నయ్య కె. కె.
మీనన్ . తాటాకు తో చేసిన టపాకాయలు తెచ్చి ఇచ్చేవాడు. వాటిని చాలా ఆనందంగా కాల్చేవాడిని . అలా దీపావళిని సాగనంపడం జరిగేది.
అసలు దీపావళికి ,టపాసులు ఎందుకు కాలుస్తారో తెలిసేది కాదు. కాస్త
వయసు వచ్చాక ,టపాకాయలు కొనుక్కునే స్థాయి వచ్చినప్పటికీ,పెద్ద
అభిరుచి ఉండేది కాదు. అది ఇంకా క్రమంగా తగ్గుతూ వచ్చింది. మా
పిల్లలకు నా పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ,టపాసులు
కాల్చడం అంటే ,కరెన్సీ నోట్లు కాల్చి బూడిద చేస్తున్నామన్న ఆలోచన వస్తున్నది.
సంక్రాంతి మాత్రం మా ఇంట్లో పండగ వాతావరణం తీసుకు వచ్చేది.దానికి
ప్రత్యేక కారణం ,జనవరి -13 ,నా పుట్టిన రోజు కావడమే ! నా పుట్టిన
రోజుకు మా అమ్మ తప్పక ఒక కాకి నిక్కరు ,ఖద్దరు చొక్కా కొనేదే. ఆ ..
డ్రస్సు కొట్టించుకోవడం పెద్ద ప్రహాసనం . మా వూరికి  ఒకె  టైలర్ ఉండేవారు.
అందరూ ఆయనకే బట్టలు  ఇచ్చేవారు కు ట్ట దానికి . ఇస్తానన్న సమ
యానికి ఆయన బట్టలు ఇచ్చేవాడు కాదు. రోజూ అతని దగ్గరకు వెళ్లడం
నిరాశగా తిరిగి రావడం జరిగేది. మొత్తం మీద పండగకి ఒక రోజు ముందు
ఇచ్చేవాడు. ఆ రోజు ఎంత ఆనందం అనిపించేదో !
ఇప్పుడు అన్నీ వున్నాయ్. ఆ వాతావరణమే లేదు. ఎంతో  ప్రేమగా
పెంచిన అమ్మ కూడాలేదు. రోజులు ఎప్పుడూ ఒకేలా వుండవు కదా !


                   


కామెంట్‌లు