మేటి (నాటు )వైద్యుడు : కె . ఎల్వీ

ఒకప్పుడు గ్రామాలు లేదా పల్లెటూళ్ళు ,అనారోగ్య సమస్యలకు ఎక్కువ శాతం’గృహ వైద్యం ‘ మీదే  ఆధారపడి ఉండేవారు . కారణం అందరికీ 
తెలిసిందే !వైద్యరంగం అప్పటికి పల్లెటూళ్లకు విస్తరించబడలేదు . ఆసు -
పత్రికి వెళ్లాలంటే ,కిలోమీటర్ల దూరం నడవాలిసిందే . కనీసం ఆర్. ఎం.పి 
వైద్య సదుపాయం కూడా అందుబాటులోలేని రోజులవి ,అవే -నా బాల్యపు 
రోజులు . అసలు అప్పుడు ఆయా ప్రాంతాలలోని ప్రజలు ఎలా బ్రతికి బట్ట-
కట్టారో .. ఇప్పటికీ అర్ధం కాదు . అయితే అప్పటి కల్తీ లేని ఆహారం ,శరీరా
నికి సరిపడినంత సహజ వ్యాయామం ,స్వచ్ఛమైన గాలీ ,నీరూ ,పాడీ ,
వృక్ష సంపదా వారిని ఆరోగ్యవంతులుగా వుంచాయని సర్ది చెప్పుకోవాలి !
కేవలం పరిశుబ్రత లోపంవల్ల అక్కడక్కడా ,అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతుండేయి . అలాంటి వారికోసం ,అటు ఆర్. ఎం. పి,వైద్యు--
లకు ,ఇటు నాటు వైద్యులకూ మధ్యస్తంగా ,గ్రామంలో ఎవరోఒకరు తమ-
కు ,తోచిన రీతిలో వైద్యం చేస్తుండేవారు. వారికి ఎలాంటి వైద్యం చేసే అర్హత 
ఉండదు . కానీ .. వైద్యం చేస్తారు . 
నా చిన్నతనం లో అలాంటి వారు ఇద్దరు ఉండేవారు. నాడి చూసి వైద్యం చెప్పే నిరక్ష్యరాస్యుడు (పశువుల కాపరి )ఒకాయన . ఆయన పేరు 
కలిగిత లక్ష్మయ్య . పంచెకట్టు,భుజాన కండువా ,చేతిలో దుడ్డు కర్ర ,తైల -
సంస్కారం లేని తల,ఆయన ఆహార్యం . ఇంటికి వచ్చేవారు ఆయన. మరొకరు దేవ జనార్దన్. భారీ శరీరం . అర్హత లేని హోమియో వైద్యుడు . 
కమ్యూనిస్టు ఉద్యమకారుడిగా జైలులో వుండి నేర్చుకున్న వైద్యం . 
హోమియో మాత్రలకోసం ఇంటికి వెళ్ళాలి . బయటికి వచ్చేవారు కాదు 
ఆయన . మా తల్లిదండ్రులు ఎక్కువగా కలిగిత.లక్ష్మయ్య గారి మీదే ఆధార పడేవారు. 
ఎప్పుడైనా నాకు జ్వరం వస్తే ,ఆయన్ను పిలిపించేవారు. ఆయన నాడిచూసి ,’’లంఖణం పరమౌషధం ‘’సూత్రాన్ని అక్షరాలా అమలు చేయించే వారు . అసలే .. నాకు ఆకలి ఎక్కువ . తినకపోతే చాలా నీరసం 
వచ్చేది . నా విషయం తెలిసిన మా మేనత్త ,(వాళ్ళ ఇల్లు మా ఇంటి పక్క
నే )రాపాక ఎల్లమ్మ ,ఎవరూ చూడకుండా ,చాటుగా అన్నం తెచ్చి తిన 
మనేది . నేను గబ.. గబ.. తినేసేవాడిని. రెండురోజుల తర్వాత సదరు 
వైద్యుడుగారు ,నాడి చూసి ,మా అమ్మను ఉద్దేశించి ‘’ఎంపీల్లా .. వీడికి 
అన్నం పెట్టేశారా “అనేవాడు . ఆలోచిస్తే అది ఇప్పటికీ ఆశ్చర్యం కలిగించే 
అంశమే !
ఇక జ్వరం తగ్గాక -అసలు నిద్రపోకూడదన్న ఆంక్ష ఉండేది . మిరియాల చా రు తో భోజనం చేసాక ,నిద్ర ముంచుకొచ్చేది . నిద్ర రాకుండా ఎదో ఆకులు తెచ్చి ,చేతులతో నలిపి వాటి పసరు కళ్ళల్లో పిండేవాడు. అంతే 
కళ్ళు ఒకటే మంటలు ఎక్కడినిద్ర అక్కడికి పరార్ . అది గుర్తుకు వస్తే 
ఇప్పటికీ వళ్లు గగుర్పొడుస్తుంది . 
అలా .. బాల్యాన్ని నేటేశాం . బడికి వెళ్లే వయసు వచ్చేసరికి ఆర్. ఎం.పి 
వైద్యుల రాకపోకలు ప్రారంభం అయ్యాయి . ఇంజెక్షన్ల పర్వం మొదలయింది నేను హైద్రాబాద్ కు చేరుకోవడం కూడా జరిగిపోయింది !


కామెంట్‌లు