అప్పుడు --ఇప్పుడు ..!!--డా .కె .ఎల్.వి.ప్రసాద్ --హనంకొండ ,వరంగల్ .

నేను రాజోలు బడిలో చేరడం వల్ల జీవితంలో 
మొదటి సారి గ్రామం విడిచి తాలూకా కేంద్రం 
వాతావరణాన్ని చవి చూసే అవకాశం కలిగింది .
వసతి గృహంలోకి ప్రవేశం దొరికినంత వరకూ రోజూ 
దిండి నుండి రాజోలుకు ,రాజోలు నుండి దిండికి 
కాలినడకన రాకపోకలు జరిగేవి.దానివల్ల పెద్దగ 
అలసిపోయిన జ్ఞాపకాలు లేవు .రాజోలునుండి 
శివకోడు లాకులు ,అక్కడి నుండి దిండికి కాలువ గట్టే దిక్చూచిగా ఉండేది.రాత్రులు గుడ్డి దీపాల 
ముందు కూర్చుని చదువుతుంటే నిద్ర వచ్చేసేది .
మానాయన "నిద్ర పోరాదా ..ఎందుకు ఆ ..కునికి ..
పాట్లు " అనేవారు .మా ..అమ్మ మాత్రం "బాగా ..
చదువుకోవాలి నాయనా "అనేది .ఇక్కడ ప్రత్యేకం 
గా చెప్పవలసింది ఏమిటంటే ,మా అమ్మ చాలా 
తెలివైనది ,నూరు శాతం నిరక్షరాస్యురాలు .మాకు 
చదువు విషయంలో ,ఆవిడ ప్రొత్సాహం బహు ..
గొప్పది .
బడికి వెళ్లేప్పుడు భోజనం మద్యాహ్నం తినడానికి 
అరటి ఆకులో పేక్ చేసి ఇచ్చేది మా అమ్మ .అది 
బడిలో తినే ప్రత్యేక సదుపాయం ఉండేది కాదు .
అందుచేత రాజోలు మెయిన్ రోడ్డు పక్క ఒక 
లాండ్రీ షాపు ఉండేది .దాని యజమాని కనకం .
ఆ లాండ్రీ షాపులో లంచ్ పేకెట్లు ఉంచి ,బడి నుండి 
మధ్యాహనం అక్కడికి వెళ్లి తినేవాళ్ళం .ఈ పద్దతి 
మా సీనియర్లనుండి కొనసాగుతూ వచ్చింది.బడిలో 
వాష్ రూములు (మూత్రశాలలు )ఉండేవి కాదు .
ఇది భయంకర అంశం .తలచుకుంటేనే బాధ కలుగు 
తుంది .ఆడపిల్లలు ఎలావుండేవారో ఇప్పటికీ 
అర్ధంకాదు.అత్యవసర పరిస్తితిలో బడికి కాస్త 
దగ్గరలో ఉన్న కాల్వగట్టును ఆశ్రయించే వాళ్లం .
అప్పడప్పుడూ ఈ హడావిడిలో చెడ్డీలు ఖరాబు 
అయిన సంఘటనలు కూడా లేకపోలేదు .మరీ 
గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ,రాజోలు 
సెంటర్ లో నడుస్తున్నప్పుడు ,పండ్ల దుకాణాల్లో 
ఆపిల్ పండ్లు వేలాడగట్టి ఉండేవి.అప్పుడు వాటిని 
కొనుక్కుని తినే స్థోమత నాకు ,కొనిచ్చే అవకాశం 
నా తల్లిదండ్రులకూ లేదు .వాటిని చూసినప్పుడల్లా 
" జీవితంలో నేను ఆపిల్ తినగలనా ?"అనుకునే 
వాడిని .
ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే ,ఏమైనా కొనుక్కుని 
తినే స్థోమత ఇప్పుడు నాకు ఉంది ,కానీ అన్నీ తినలేని 
పరిస్థితి నాది .వయసుతోపాటు కలిసి ప్రయాణించే 
అనారోగ్య సమస్యలే కారణం మరి !


కామెంట్‌లు